చెక్ స్లిప్ మాయాజాలం !

5 Feb, 2014 05:17 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్:  ‘పైసామే పరమాత్మా..’ అన్నట్లు విద్యాశాఖను డబ్బు శాసిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం వెసులుబాటు కల్పించే చెక్ స్లిప్ బదిలీలు డబ్బున్నవారికి వరంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ముడుపులు ముట్టజెపితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారైనా సరే.. నేరుగా జిల్లా కేంద్రానికో.. లేదా ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలకో బదిలీ కావడం కష్టమేమీ కాదని పలువురు అంటున్నారు.

కొందరు టీచర్లు ఆయా ఉపాధ్యాయ సంఘాల అండతో రాజధానిలో మకాం వేసి.. ఏకంగా ముఖ్యమంత్రి పేషీ నుంచే బదిలీ ఆర్డర్లు తెచ్చుకోవడం జిల్లాలో మంగళవారం చర్చనీయాంశంగా మారింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నలుగురు పీజీ హెచ్‌ఎంలు, ఏడుగురు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఇద్దరు భాషా పండితులు, ఒక పీఈటీ, 11 మంది స్కూల్ అసిస్టెంట్లు, నలుగురు ఎస్జీటీలు ఎలాంటి సమాచారం లేకుండా, ఏకంగా బదిలీ ఆర్డర్‌తో రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం కంగుతిన్నారు. మరో 50 రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు ఉండగా, ఇలా ఆకస్మికంగా బదిలీ చేయడం సరికాదని, ఈ ప్రభావం పది ఫలితాలపై పడే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 చేతులు మారిన  లక్షల రూపాయలు...?
 ఉపాధ్యాయుల దొడ్దిదారి బదిలీలు పలు ఉపాధ్యాయ సంఘాల వారికి, రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురింపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో కాలంగా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న తాము ఎలాగైనా మైదాన ప్రాంతాలకు, అదీ జిల్లా కేంద్రానికి సమీపంలోకి రావాలనే పలువురు ఉపాధ్యాయుల కోరిక  నాయకులకు వరంగా మారింది. మరో రెండు నెలల్లో ప్రభుత్వ  పదవీ కాలం ముగియడంతో.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో దొడ్డిదారిన బదిలీల పరంపర కొనసాగించినట్లు సమాచారం.

 ఇందుకోసం  భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. వీటితో పాటు సంఘాల నాయకుల ఖర్చులు, మంత్రుల పేషీ నుంచి రికమండెడ్ ఉత్తరాల పేరుతో కూడా వేల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో చెక్ స్లిప్ బదిలీల పుణ్యమా అని  లక్షలు చేతులు మారాయంటున్నారు. జిల్లాలోని   కొందరు ఉపాధ్యాయులు అధికార, ప్రతిపక్ష నాయకులతో కలిసి  సీఎం పేషీకి వెళ్లగా, మరికొందరు రాజధానిలో లాబీయింగ్ చేసి ఏకంగా ముఖ్యమంత్రి పేషీలోనే పైరవీలు చేయించినట్లు తెలిసింది.

  పదో తరగతి ఫలితాలపై ప్రభావం...
 పలువురు అధికార పార్టీ నాయకులు డబ్బు ఆశతో చేసిన చెక్ స్లిప్ బదిలీల పాపం పదో తరగతి విద్యార్థులకు శాపంగా మారనుంది. మార్చి 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో సంపూర్ణ ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, కనీస ఉత్తీర్ణతా స్థాయి సాధించేంచడం, స్లిప్ టెస్ట్‌లు పెట్టడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, సబెక్టు టీచర్ల పాత్ర కీలకం.

అయితే మంగళవారం జరిగిన చెక్ స్లిప్ బదిలీల్లో భద్రాచలంలోని నన్నపనేని ఉన్నత పాఠశాల, చర్ల మండలంలోని కుదునూరు ఉన్నత పాఠశాల, కూనవరం మండలం మర్రిగూడెం హైస్కూల్, జూలూరుపాడు జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు బయోలాజికల్ బోధించే స్కూల్ అసిస్టెంట్లు, ఒక ఇంగ్లిష్ ఎస్‌ఏ, ఒకరు మాథ్స్ ఎస్‌ఏ, ఇద్దరు ఫిజికల్ సైన్స్ ఎస్‌ఏలు, ముగ్గురు  సాంఘిక శాస్త్రం ఎస్‌ఏలు ఖమ్మం పరిసర ప్రాంతాలకు వచ్చారు. ఇంతకాలం ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోధించిన ఈ ఉపాధ్యాయులు.. పరీక్షలయ్యేంత వరకు వారి వెంట ఉండి ఉత్తీర్ణత శాతం పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇలా అర్ధంతరంగా బదిలీ కావడంతో ఆశించిన ఫలితాలు రావడం కష్టమేనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

 నష్టపోనున్న మైదాన ప్రాంత నిరుద్యోగులు..
 జిల్లాలో ఏజెన్సీ , మైదాన ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలు వేర్వేరుగా జరుగుతాయి. జీవో నంబర్ 3 ప్రకారం ఏజెన్సీలోని ఖాళీలను ఆయా ప్రాంతాల్లోని గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. అయితే మంగళవారం జరిగిన చెక్ స్లిప్ బదిలీల్లో పైన పేర్కొన్న వారితో ఇంకా పలువురు ఉపాధ్యాయులు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రానున్నారు. దీంతో ఏజెన్సీ ఏరియాల్లో ఖాళీలు ఏర్పడి, మైదాన ప్రాంతంలోని పోస్టులు భర్తీ అవుతాయి.

 ఇప్పటికే ఈ ప్రాంతంలోని 17 మండలాల్లో సింగిల్ డిజిట్స్‌లో మాత్రమే ఖాళీలు ఉండగా, పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ ఖాళీలు కూడా ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులతో భర్తీ చేస్తే తమ పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులు డబ్బుకు ఆశపడి తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని  ఆందోళన చెందుతున్నారు.

>
మరిన్ని వార్తలు