పోస్టులు పక్కదారి 

25 Sep, 2019 08:55 IST|Sakshi

జిల్లాలోని కేజీబీవీ కళాశాలల్లో చదువుతున్న బాలికల తరగతులు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో లెక్చరర్ల నియామకాలు పూర్తయ్యాయి. ఈ జిల్లాలో మాత్రం పూర్తి కాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేజీబీవీ కళాశాల లెక్చరర్ల పోస్టులను రెండు నెలలుగా భర్తీ చేయకపోవడం, ఇంటర్వ్యూలు నిర్వహించి రెండు వారాలు పూర్తి కావస్తున్నా.. నియామకాలు జరగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన  కేజీబీవీ ఔట్‌ సోర్సింగ్‌ లెక్చరర్ల నియామకాలను సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతి బాలిక ఉన్నత చదువును అభ్యసించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఈ ఏడాది కేజీబీవీ కళాశాలలను ప్రారంభించారు. జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలలను స్థాయి పెంచి 16 జూనియర్‌ కళాశాలలుగా ప్రారంభించారు. ఆ కళాశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి, అర్హత కలిగిన లెక్చరర్లను నియమించాలని రెండు నెలల క్రితమే రాష్ట్ర సమగ్రశిక్షాఅభియాన్‌ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇప్పటివరకు నియామకాలు పూర్తి కాలేదు.

ముడుపులు ఇవ్వాల్సిందే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకమైన పాలన అందించాలని పదేపదే ఆదేశిస్తున్నారు. అయితే సమగ్రశిక్షాఅభియాన్‌ శాఖలో పనిచేసిన మాజీ పీఓ కేజీబీవీల నియామకాలను పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపణలున్నా యి. లెక్చరర్ల పోస్టింగ్‌ల ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరగలేదని దరఖాస్తులు చేసిన అభ్యర్థులు వాపోతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.50 వేలు నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేశారని విశ్వసనీయ సమాచారం. గతనెల 15 నుంచి 25వ తేదీ వరకు సమగ్రశిక్షాఅభియాన్‌ శాఖలో ఇంటర్వ్యూ లు నిర్వహించారు. ఈ పోస్టులకు జిల్లావ్యాప్తంగా 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 1:2 ప్రాతిపదికన 200 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఆ  ఇంటర్వ్యూలు పూర్తిచేసిన వెంటనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే అలా జరగలేదు. ఇంటర్వ్యూలో పాల్గొన్న డీవీఈ ఓ, సబ్జెక్టు నిపుణులతో అభ్యర్థులకు వేసే మార్కులను పెన్సిల్‌తో వేయించుకున్నారు. ఆ తర్వాత ఆ మార్కులను సరిదిద్ది తమకు అనుకూలమైన వారికి మార్కులు వేసుకుని తుది నివేదికలు త యారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు పూర్తి అయిన తర్వాత ముడుపులు ఇచ్చిన వారి పేర్లను నివేదికల్లో మార్పు చేసి కలెక్టర్‌ ఆమోదం కోసం పెట్టారని ఆ శాఖ సిబ్బంది ద్వారా తెలిసింది. 

ప్రారంభం కాని తరగతులు
జిల్లాలోని 16 కేజీబీవీ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో అధ్యాపకులు లేక మూడు నెలలుగా తరగతులు ప్రారంభం కాలేదు. ఉన్నత ఆశయాలతో ఇంటర్మీడియట్‌లో అడుగుపెట్టిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. రెండునెలలుగా పాఠాలు జరగకపోవడంతో ఆ బాలికల భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. మూడునెలలుగా పాఠాలు జరగకపోతే తమ పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థులు ఉతీర్ణులు కాకపోతే బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. కేజీబీవీ కళాశాలల్లో 400 మంది బాలికలు ఏం చేయాలో పాలుపోక మిన్నకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని ఆ ఇంటర్వ్యూలను మరో శాఖకు అప్పజెప్పి పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా