‘మల్టీ’ అక్రమం!

10 Sep, 2019 11:44 IST|Sakshi
కేఎస్‌పీ మల్టీప్లెక్స్‌ ఎదుట రోడ్డుపై వాహనాలు

కోడెల శివరామకృష్ణ మల్టీప్లెక్స్‌ నిర్మాణంలో ఆది నుంచి అంతా అక్రమమే. వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ చెల్లించలేదు. స్థలం ఇదరు వ్యక్తుల పేరుతో ఉంది. కానీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఒకరి పేరుతో అనుమతులు ఇచ్చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించ లేదు.  డెవలప్‌మెంట్‌ చార్జీలు అస్సలే కట్టలేదు.. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) వచ్చేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించేశారు.  ఒక్క అధికారి కూడా ప్రశ్నించలేదు.

సాక్షి, గుంటూరు : గుంటూరు నగరంలోని నాజ్‌ సెంటర్‌లో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ ఇండో అమెరికన్‌ సూపర్‌ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ పేరుతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్టీ ప్లెక్స్‌ను నిర్మిం చారు. అయితే నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ విధించిన ఏ ఒక్క నిబంధనను పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. పన్నుల ఎగవేత వ్యవహారాన్ని పక్కన బెడితే ఏకంగా మల్టీఫ్లెక్స్‌లో సెట్‌బ్యాక్‌ కోసం వదిలేసిన స్థలంలో అక్రమంగా మరో వ్యాపార సముదాయాన్ని నిర్మించడం విశేషం. 

మంటరాజుకుంటే ఎలా?
నిబంధనల ప్రకారం కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణ నష్టం జరుగకుండా అగ్నిమాపక శకటాలు కాంప్లెక్స్‌ చుట్టూ తిరిగేలా సెట్‌బ్యాక్‌ను వదలాల్సి ఉంది. కోడెల కుమారుడి మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ సమయంలో కార్పొరేషన్‌ అనుమతులు పొందడం కోసం సెట్‌బ్యాక్స్‌ స్థలాన్ని చూపించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొంది కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కాంప్లెక్సుకు పన్నులు సైతం వేసేశారు. ఇదంతా పూర్తయిన వెంటనే సెట్‌బ్యాక్‌కు వదిలిన స్థలంలో కేఎస్‌పీ ఫుడ్‌ వరల్డ్‌ పేరుతో అడ్డగోలుగా 15 షాపులను నిర్మించి వివిధ రకాల ఆహార వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల వారు ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు, చిన్న నిర్మాణం చేపడితేనే అనుమతులు లేవంటూ హడావుడి చేసే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కోడెల కుమారుడు గతంలో పట్టపగలు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం.

పార్కింగ్‌ పేరుతో..
కోడెల కుమారుడి మల్టీప్లెక్స్‌లో పార్కింగ్‌ ఫీజు అధికంగా వసూలు చేస్తుండటంతో కాంప్లెక్సులోని సినిమా హాళ్లకు, షాపింగ్‌కు వచ్చే ప్రజలు కాంప్లెక్సుకు ఎదురుగా ఉన్న రోడ్డుపైనే వాహనాలు నిలిపివేసి వెళుతున్నారు. ద్విచక్రవాహనానికి రూ.20, కారుకి రూ.50 వసూలు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

మరిన్ని వార్తలు