బోర్డుల పేరుతో బొక్కేశారు!

11 Oct, 2019 09:17 IST|Sakshi

ఈ చిత్రంలో కనిపించే ఫాంపాండ్‌ వెల్దుర్తి మండలం బింగిదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోనిది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నిర్మించారు. దీనిని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించినట్లు వర్క్‌సైట్‌ బోర్డును విధిగా పెట్టాలి. బోర్డులో వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలి. అధికారుల రికార్డుల్లో వర్క్‌సైట్‌ బోర్డు పెట్టినట్లుగా ఉన్నా.. ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. ఇటువంటివి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి.  

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రతి పని దగ్గర బోర్డు ఏర్పాటు చేయాలి. అందులో పని విలువ, పని ఐడీ నంబరు, పనిదినాలు తదితర పూర్తి వివరాలు ఉండాలి. ఫలితంగా అక్రమాలకు తావు ఉండదు. జిల్లాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)నిధులతో వేలాది పనులు నిర్వహిస్తున్నప్పటికీ వాటి దగ్గర బోర్డులు కనిపించడం లేదు. రికార్డుల్లో మాత్రం అవి ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటి పేరుతో కొందరు ఉపాధి సిబ్బంది భారీగా నిధులు కొల్లగొట్టారనే విమర్శలు ఉన్నాయి. సుమారుగా రూ.7.63 కోట్ల మేర అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. కంప్యూటర్‌ ఆపరేటర్ల సహాయంలో ఈ నిధులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు కొందరు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది మళ్లించినట్లు స్పష్టం అవుతోంది.

పలువురు ఏపీవోలు, సాంకేతిక సహాయకుల ఖాతాలకు నిధులు మళ్లినట్లు తెలుస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అంటేనే అక్రమాల పుట్ట అనే పేరుంది. పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, ఇతర అభివృద్ధి పనులను కూడా ఉపాధి నిధులతో చేపట్టినట్లు చూపి అక్రమార్కలు నిధులు కొల్లగొట్టిన సంఘటనలు కోకొల్లలు. ఇటువంటి అక్రమాలకు తావు ఉండరాదనే ప్రతి పనిదగ్గర వర్క్‌సైట్‌ బోర్డు పెట్టాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే బోర్డుల పేరుతో కూడా నిధులు కొల్లగొట్టడం అక్రమాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. 

పనులు ఇలా.. 
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2017–18లో 51,423 పనులు చేపపట్టారు. అలాగే 2018–19లో 82,231 పనులు పూర్తి చేశారు. 2019–20లో 99,855 పనులు చేపట్టగా... 19,289 పనులు పూర్తి అయ్యాయి. మిగతా 80,566 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.  నిబంధనల ప్రకారం పని మొదలైన వెంటనే  బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎటువంటి బోర్డులు పెట్టాలి.. వాటి సైజు ఎంత... వాటికి చేయాల్సిన ఖర్చుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. సైజును బట్టి రూ.850 నుంచి రూ.2,500 వరకు ఖర్చు చేయవచ్చు. ఐదు రకాల బోర్డులు పెట్టేందుకు అనుమతులు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన పనులతో పాటు ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్ల కింద చేపట్టిన పనుల దగ్గర కూడా వర్క్‌సైట్‌ బోర్డులు పెట్టాల్సి ఉంది. అయితే బోర్డులు పెట్టడంలో నిర్లక్ష్యం చోటు చేసుకోగా... అక్రమాలు కూడా వెల్లువగానే ఉన్నాయి. 

50,873 వర్క్‌సైట్‌ బోర్డులు పెట్టినట్లు లెక్కలు... 
2017–18 నుంచి 2019–20 వరకు 2,33,509 పనులు చేపట్టారు. నిబంధనల ప్రకారం ఈ పనులన్నింటి దగ్గర బోర్డులు పెట్టాల్సి ఉంది. అయితే 50,873 పనుల దగ్గర ఏర్పాటు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇవి కనిపించవు. సామాజిక తనిఖీల బృందాలు విధిగా వర్క్‌సైట్‌ బోర్డులు ఉన్నాయో..లేదా పరిశీలించాలి. ఒక్కోదానికి సగటున రూ.1500 ప్రకారం లెక్కించినా జిల్లాలో 50,873 బోర్డులకు రూ.7.63 కోట్లు ఖర్చు చేసినట్లు  తెలుస్తోంది. కర్నూలుకు చేరువలోని మండలంలో పనిచేసే ఓ ఏపీవో దాదాపు రూ.1.50 లక్షల వర్క్‌సైట్‌ బోర్డుల నిధులను తమ ఖాతాలోకి ట్రాన్స్‌పర్‌ చేయించుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. 

పర్యవేక్షణ శూన్యం...     
జాతీయ గ్రామీణ ఉపాధి పనుల నిర్వహణలో ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏపీవో, సాంకేతిక సహాయకులు, పీల్డ్‌ అసిస్టెంట్లు పనితీరు, పనుల పురోగతి, వర్క్‌సైట్‌ బోర్డుల ఏర్పాటు తదితర వాటిపై పర్యవేక్షించాల్సిన బాధ్యత అసిస్టెంటు ప్రాజెక్టు డైరెక్టర్‌లపై ఉంది. ప్రతి క్లస్టర్‌కు ఏపీడీలు ఉన్నా.. పర్యవేక్షణ లోపించిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొంతమంది ఏపీడీలు కూడా అక్రమాల్లో మునిగితేలుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ‘ఉపాధి’లో అక్రమాలు సర్వసాధారణం అవుతున్నాయి.   

చర్యలు తీసుకుంటాం
నిబంధనల ప్రకారం ప్రతి పని దగ్గర బోర్డు ఉండాల్సిందే. ఈ మేరకు అదేశాలు ఇచ్చాం. వీటి ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే చాలా చోట్ల బోర్డులు పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు.   
– వెంకటసుబ్బయ్య ,పీడీ, డ్వామా  

మరిన్ని వార్తలు