కాలంతో కుస్తీ నాణ్యతకు స్వస్తి

17 Oct, 2018 11:38 IST|Sakshi

పోలవరం నిర్వాసిత కాలనీల నిర్మాణాల్లో అక్రమాలు

చూపించిన స్థలం ఒకచోట, కట్టేది మరోచోట     

నాసిరకం ఇసుక, ఇటుకలు

ఆగ్రహంతో నిర్వాసితులు 

పట్టించుకోని అధికారులు 

వేలేరుపాడు: పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు చూపించిన స్థలం ఒక చోటైతే.. మరో చోట ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా పనులు నడుస్తున్నాయి. మళ్ళీ మునిగే చోటే పునరావాస కాలనీలు నిర్మిస్తుండటంతో ఇటీవల అనేక గ్రామాల గిరిజన నిర్వాసితులు అధికారుల తీరుపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇంత జరిగినా ఉన్నతాధికారుల్లో చలనం మాత్రం కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుంటుంబాలు తమ ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలు, 19,545 గిరిజనేతర కుటుంబాలు న్నాయి. ఇందులో గిరిజనేతర నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాసం కల్పించనున్నారు. పదివేల గిరిజన కుటుంబాలకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు మండలాల్లో  కాలనీల నిర్మాణాలు చేపడుతున్నారు.

మూడు మండలాల్లో గిరిజనులకు పునరావాస కాలనీలు
వేలేరుపాడు మండలంలోని ఏడు గ్రామ పంచా యతీలు, 48 గ్రామాల్లోని 4800 మంది గిరిజన నిర్వాసితులకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఏడు చోట్ల ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నారు. దర్భగూడెంలో 980, బుట్టాయగూడెంలో 1100, రౌతుగూడెంలో 310, దొరమామిడిలో 700, స్వర్ణవారిగూడెంలో 450, ముల్కలంపల్లిలో 950, రాసన్నగూడెంలో 400 ఇళ్లు నిర్మిస్తున్నారు. కుక్కునూరు మండలంలో 15 గ్రామపంచాయతీల్లోని  59 గ్రామాల్లో 3048 మంది నిర్వాసితులకు ఇళ్ల కాలనీలు ఇదే మండలంలో ఐదు చోట్ల నిర్మిస్తున్నారు. మండలంలోని పెదరావిగుడెం, ఉప్పేరు, కివ్వాక, దాచారం(రాయికుంట), చీరవల్లి తదితర గ్రామాల్లో ఈ కాలనీలు నిర్మిస్తున్నారు.  పోలవరం మండలంలో గిరిజనులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని దర్బగూడెం, పి.నారాయణపురం, వెంకవారిగుడెం, రాచన్నగూడెం, జీలుగుమిల్లి గ్రామాల్లో కాలనీలు నిర్మిస్తున్నారు. 

రూ.470 కోట్ల పనుల్లో నాణ్యతకు తిలోదకాలు 
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, హౌసింగ్, ఏపీఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)తదితర ఐదు శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.470 కోట్ల వ్యయంతో ఈ పునరావాస కాలనీల పనులు చేపడుతున్నారు. ఇందులో హౌసింగ్‌ శాఖకు రూ.222 కోట్లు, ఐటీడీఏ ఇంజనీరింగ్‌కు రూ.161 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.41 కోట్లు మిగతావి ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్‌ఐడీసీలకు కేటాయించారు. ఈ నిర్మాణ పనులు ఈ ఐదు శాఖలకు ప్రభుత్వం అప్పగించి చేతులు దులుపుకుంది. తొందరగా పనులు పూర్తిచేయాలనే సాకుతో ఈ పనులన్నీ నాణ్యతాలోపంగా చేపడుతున్నారనే ఆరోపణలు నిర్వాసితుల నుండి వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాంట్రాక్టర్‌లే ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌లు ఇచ్చే పర్సంటేజీలకు తలొగ్గిన కొంతమంది ఇంజనీరింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

నాసిరకం ఇసుక, ఇటుకల వాడకం 
ఈ కాలనీల నిర్మాణాలకు గోదావరిలో ఇసుకతోపాటు వాగు, వంకల్లోని నాసిరకం ఇసుకను వినియోగిస్తున్నారు. ఎస్టిమేట్‌లో ఉన్న లీడ్‌ ప్రకారం ఉన్న ఇసుకను వాడటంలేదు. పునరావాస కాలనీ పేరుతో కుక్కునూరు మండలం నుండి తెలంగాణ రాష్ట్రానికి టిప్పర్లు, లారీల్లో ఇసుక భారీగా తరలిపోతోంది. కానీ ఈ కాలనీ నిర్మాణాలకు నాసిరకం దుబ్బ ఇసుకను వినియోగిస్తున్నారు. దీని వల్ల పదికాలాలపాటు పటిష్టంగా ఉండాల్సిన నిర్మాణాలు కుప్పకూలే ప్రమాదంలేకపోలేదు. అదేవిధంగా సిమెంట్‌ ఇటుకలు, మెటల్, చిప్స్‌ కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. 

చూపించింది ఒకచోట.. కట్టేది మరో చోట
వేలేరుపాడు మండలంలోని కాచారం, టేకుపల్లి, పేరంటపల్లి, కాకిస్‌నూరు, కొయిదా (కొండరెడ్ల) గ్రామాల 700 మంది నిర్వాసితులకు బుట్టాయగూడెం మండలం దొరమామిడి ప్రాంతంలో అధికారులు గత ఏడాది స్థలం చూపించారు. వీరందరికీ ఇళ్ల కాలనీ నిర్మించే ప్రదేశం నచ్చింది. ఇక్కడే నిర్మాణానికి అంగీకారం తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ ప్రదేశంలో కాకుండా మరో చోట కాలనీలు నిర్మిస్తున్నారు. అలివేరు డ్యామ్‌ ఆయకట్టు కింద ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఈ గ్రామాల గిరిజనులు అధికారులు, కాంట్రాక్టర్లపై తిరుగుబాటు చేశారు. నాసిరకంగా ఉన్న పిల్లర్ల ఐరన్‌ను తొలగించారు. కాంట్రాక్టర్‌లు  తాత్కాలికంగా వేసిన పాకలను తగులబెట్టారు. పనులను నిలిపివేశారు. కొయిదా కోయవారికి దర్భగూడెం పంచాయతీ తప్పీసవారి గూడెంలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. 

పర్సంటేజీలు ఇచ్చేటప్పుడు క్వాలిటీ ఎలా
టెండర్లు పాడుకొని పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్‌లు లాభంలేకుండా ఈ కాలనీల నిర్మాణపనులు చేపట్టడం అసాధ్యం. సిబ్బంది ఖర్చు, వాహనాల ఖర్చు, పనులు వివిధ దశల్లో ఉన్నప్పుడు బిల్లులు కావాలంటే కాంట్రాక్టర్‌లు ఇంజనీరింగ్‌ అధికారులకు సుమారు 10 శాతం పర్సంటేజీలు ముట్టజెప్పాల్సిందే. ఇదికాకుండా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్‌కు బెది రింపులు, ఇన్ని ఖర్చులు పోను  డబ్బులు మిగలాలంటే నాణ్యత ఎలా ఉంటుం దని కాంట్రాక్టర్ల వాదన. అదే నిర్వాసితులు ఎవరిల్లు వారే నిర్మించుకునే అవకాశమిస్తే, ఏ పర్సంటేజీలు ఉండవు. ఉన్నంతలో నాణ్యతగా దగ్గరుండి నిర్మించుకుంటారు. కేవలం కాంట్రాక్టర్‌ను బాగుచేయడానికే ప్రభుత్వం ఎక్కువగా మొగ్గుచూపింది. నిర్వాసితులు నిర్మించుకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటో అర్థంకావడంలేదు. నిర్వాసితులు ఇళ్ల నాణ్యతపై ఆందోళన చేస్తే పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రభుత్వంలో కొందరు పెద్దలకు కూడా ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల  ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు