నచ్చిన వారికి మెచ్చినంత!

3 Feb, 2019 09:48 IST|Sakshi

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారి ఇష్టారాజ్యం

ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా అడ్డగోలుగా నియామకాలు

నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు సిబ్బందికి కీలక బాధ్యతలు

రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి చర్యలు శూన్యం

ఏపీఎండీసీలో సాగుతున్న తంతుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

సాక్షి, అమరావతి: పేరుకు అదో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. కానీ పారదర్శకతకు, ప్రభుత్వ నిబంధనలకు అక్కడ చోటే లేదు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాటే వేదం. ఆయన ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా తనకు కావాల్సిన వారికి ముఖ్యమైన కాంట్రాక్టు పోస్టులిచ్చేస్తుంటాడు. అందులో తనకు నచ్చిన వారికి మెచ్చినంత వేతనం కూడా.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)లో సాగుతున్న తంతు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ముసుగులో ఒకే సామాజికవర్గం వారికి భారీగా పోస్టులు కట్టబెట్టారు. అత్యధిక పారితోషికమిచ్చే కాంట్రాక్టు పోస్టుల్లో దాదాపు ఒకే సామాజిక వర్గం వారే ఉన్నారని.. తమపై పెత్తనం చెలాయిస్తున్నారని మరోవైపు రెగ్యులర్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

నిబంధనలకు పాతర..
ముఖ్యమైన పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బందిని పెట్టకూడదంటూ ప్రభుత్వ నిబంధనలున్నాయి. దీన్ని కాలరాస్తూ ఏపీఎండీసీలో పలు కీలక(కోర్‌) పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బందిని పెట్టారు. రెగ్యులర్‌ సిబ్బందిపై ఈ కాంట్రాక్టు సిబ్బంది పెత్తనం చెలాయిస్తున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండదండలుండటంతో రెగ్యులర్‌ సిబ్బంది ఏమీ మాట్లాడలేక మౌనంగా భరిస్తున్నారు. ఏ సంస్థలో అయినా మానవ వనరుల అభివృద్ధి విభాగం చాలా ముఖ్యమైనది. ఉద్యోగుల పనితీరుపై రికార్డులు రూపొందించడం, నిర్వహించడం ఈ విభాగం బాధ్యతల్లో ముఖ్యమైనవి. ఉద్యోగుల పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, బదిలీల సమయంలో కూడా ఈ విభాగం నివేదికలకు ప్రాధాన్యముంటుంది. ఇంతటి కీలక విభాగం జనరల్‌ మేనేజరు(జీఎం, హెచ్‌ఆర్‌డీ) బాధ్యతలను రెండేళ్లుగా ఎ.వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా నియమించిన ఈ ఉద్యోగికి నెలకు రూ.లక్ష పారితోషికం చెల్లిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఏ సంస్థలో లేనివిధంగా..
రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఇంత అడ్డగోలుగా అధిక పారితోషికంతో కాంట్రాక్టు సిబ్బందిని నియమించిన దాఖలాల్లేవు. ఏ సంస్థలోనైనా పెద్ద పోస్టుల్లో పనిచేసే సిబ్బంది కొరత ఉంటే.. ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై తెచ్చుకోవాలి. ఖాళీల గురించి ప్రభుత్వానికి సిఫారసు చేసి భర్తీ చేయించుకోవాలి. ఏపీఎండీసీలో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నా.. వీటిని భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా డిప్యుటేషన్‌పై కూడా తెచ్చుకోవడం లేదు. నిబంధనలను గాలికొదిలేసి అత్యధిక పారితోషికంతో నచ్చిన వారిని నియమించుకున్నారు. సంస్థ ఉన్నతాధికారి సామాజిక వర్గం వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. పైగా కీలక పోస్టుల్లో వీరిని పెట్టారు. కోల్‌(బొగ్గు)కు సంబంధించిన జనరల్‌ మేనేజర్‌ (జీఎం) పోస్టు అత్యంత కీలకమైనది. రూ.వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే జీఎం పోస్టులో కాంట్రాక్టు ఉద్యోగి అనంతనేని లక్ష్మణరావును నియమించారు. నెలకు రూ.లక్ష పారితోషికంతో రెండేళ్లుగా ఆయన ఈ స్థానంలో ఉన్నారు. ఎన్‌.వెంకటేశ్వరరావు అనే మరో కాంట్రాక్టు ఉద్యోగిని బొగ్గు విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా రెండేళ్లుగా కొనసాగిస్తునే ఉన్నారు. ఇలాంటి కీలక పోస్టులన్నీ ఇష్టారీతిన అప్పగించేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఖాళీల భర్తీకి చర్యలేవీ?
ఏపీఎండీసీలో 481 మంది ఉద్యోగులుండాలి. కానీ ప్రస్తుతం 128 మందే ఉన్నారు. మరో 353 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘బాబు వస్తేనే జాబు’ అంటూ 2014 ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన కార్యాలయంలో పనిచేసే వెంకయ్య చౌదరినే ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పంపించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ ఒక్క పోస్టును కూడా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయలేదు. ఈ సంస్థలో ఏకంగా 643 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పనిచేయిస్తుండటం గమనార్హం. మరోవైపు పారదర్శకంగా వ్యవహారాలు సాగుతున్నాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతుండగా.. వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది. అధిక పారితోషికమిచ్చే పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడమే పారదర్శకతకు పాతరేశారనేందుకు నిదర్శనమని పలువురు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు