బాలయ్య అడ్డాలో అవినీతి మరక 

23 Jun, 2019 08:21 IST|Sakshi
 పూలకుంటలోని సీడీపీఓ కార్యాలయం

అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకున్న తెలుగు తమ్ముళ్లు 

ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వసూలు  

ఇంత వరకూ అందని నియామక పత్రాలు  

అయోమయంలో బాధితులు

ఆడపడచులను.. అక్కచెళ్లెమ్మలను తెలుగు తమ్ముళ్లు దగా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ తామై నడిపిస్తూ.. తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా చెలామణి అవడమే కాక.. ఏకంగా అంగన్‌వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. మూడు లక్షల వరకూ అక్రమంగా వసూలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నియామక పత్రాలు నేటికీ అందకపోవడంతో టీడీపీ నేతలను నమ్మి డబ్బు ముట్టజెప్పిన మహిళలు లబోదిబో మంటున్నారు. ఈ పరిస్థితి మరెక్కడో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనిదే. వివరాల్లోకి వెళితే..  

సాక్షి, హిందూపురం సెంట్రల్‌: సార్వత్రిక ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిందూపురం డివిజన్‌లో 49 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు,  15 సహాయక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ స్థానిక టీడీపీ నేతలకు కాసుల వర్షమే కురిపించింది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని స్థానికేతరులకు కూడా పోస్టు కచ్చితంగా వస్తుందని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల మొదలు రూ. 3 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు వసూలు చేసుకున్నారు.
  
బాధితుల్లో ఆందోళన 
నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నియామకాలు పారదర్శకంగా జరిపితే తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన వారి ఆశలపై అప్పట్లో టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. రూ. లక్షల్లో డబ్బు వసూలు చేసుకుని పోస్టింగ్‌ ఆర్డర్లు ఇప్పించకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోస్టుల భర్తీని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టనుండడంతో తమకు పోస్టులు వస్తాయో రావో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. పోస్టులు రాకపోతే తాము ఇచ్చిన డబ్బును టీడీపీ నేతలు వెనక్కు ఇస్తారో ఇవ్వరోననే భయం కూడా వారిని వెన్నాడుతోంది.
  
స్వీయ రక్షణలో టీడీపీ నేతలు
అంగన్‌వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నుంచి రూ. లక్షల్లో దండుకున్న టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. విషయాన్ని కాస్త ఎమ్మెల్యే బాలయ్య దృష్టికెళితే... తమకు ఇబ్బందులు తప్పవని భావించి స్వీయరక్షణలో పడ్డారు. ఇందులో తమ అక్రమ వసూళ్లను కప్పిపుచ్చుతూ టీడీపీని నమ్ముకున్నవారికి పోస్టులు ఎలాగైనా ఇప్పించాలంటూ బాలయ్యను  వారు ప్రాధేయపడినట్లు సమాచారం. కాగా, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ విషయంగా చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు భగ్గుమంటున్నారు. అప్పటి నోటిఫికేషన్‌ రద్దు చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసి, నియామకాలను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.   

డబ్బు వసూళ్ల అంశం మా పరిధిలోది కాదు 
హిందూపురం డివిజన్‌లో 49 అంగన్‌వాడీ టీచర్లు , 15 సహాయకులు ఖాళీలు ఉండేవి. ఈ పోస్టుల భర్తీకి గత టీడీపీ ప్రభుత్వం  నోటిఫికేషన్‌ ఇచ్చింది. వెంటనే అభ్యర్థుల నుంచి నిర్ణీత తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించాం. అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాను కలెక్టర్‌ కార్యాలయానికి పంపించాం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. స్థానికేతరులు దరఖాస్తు చేసుకున్నారన్నది అవాస్తవం. ఇక పోస్టు కోసం నాయకులకు డబ్బు చెల్లించారనేది మా పరిధిలో లేని అంశం. నిబంధనల మేరకే పోస్టుల భర్తీ ఉంటుంది.         – నాగమల్లీశ్వరి, సీడీపీఓ, హిందూపురం     

>
మరిన్ని వార్తలు