మాజీమంత్రి అండతో దా‘రుణ’ వంచన!

24 Aug, 2019 11:02 IST|Sakshi
గొర్రెల యూనిట్‌ మంజూరుచేస్తామని డబ్బు దండుకుంటున్నారంటున్న ఏడుగురాకులపల్లి గ్రామస్తులు (ఇన్‌సెట్‌లో) ఓ ప్రైవేట్‌ కంపెనీ ద్వారా అందించిన ప్రమాద బీమా పత్రం  

మాజీమంత్రి పరిటాల సునీత అండతోనే.. 

గొర్రెల యూనిట్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరితో రూ.1600 వసూలు 

ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల రుణాలూ ఇప్పిస్తామని దండుకు

మంజూరు చేయించకుండా చేతులెత్తేసిన తెలుగుదేశం నాయకులు 

మాజీ మంత్రి పరిటాల సునీత అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్రమార్జనకు తెరలేపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఏడాది కిందటే బీరాలు పలికి అమాయకులకు రుణాలు మంజూరు చేయిస్తామని ఆశ చూపి డబ్బు దండుకున్నారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందడంతో రుణాలు మంజూరు చేయించలేక చేతులెత్తేశారు. బాధితులు ఈ విషయమై నిలదీస్తే వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 

సాక్షి, రామగిరి: గత తెలుగుదేశం పాలనలో వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికందక రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీడీపీ నాయకులు పలువురు రైతులకు, ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బు వసూలు చేసుకుని జల్సాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత మండలమైన రామగిరిలో ఈ ఉదంతం వెలుగు చూసింది. రామగిరి మండలంలో పేరూరు మేజర్‌ పంచాయతీ. ఆ గ్రామం చుట్టుపక్కల కంబదూరు, కనగానపల్లి మండలాలలోనున్న గ్రామాల కంటే పెద్ద వ్యాపారకేంద్రం. వర్షాభావంతో వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద గొర్రెల యూనిట్‌ మంజూరు చేయిస్తామని, అలాగే ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరు చేయిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.1600 చొప్పున వసూలు చేశారని బాధితులు బావన్న, హనుమంతు, నరసింహులు, గంగయ్య, లింగమయ్య, హనుమంతు, రాఘవేంద్ర తదితరులు వాపోయారు. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగురాకులపల్లి, దుబ్బార్లపల్లి, పేరూరు గ్రామాలలోనే వందలాదిమంది ఇటువంటి బాధితులు బయటపడ్డారు. 

గొర్రెలు లేకుండానే ఇన్సూరెన్స్‌ కార్డుల పంపిణీ 
డబ్బులు దండుకున్న టీడీపీ నాయకులు గొర్రెల యూనిట్‌ మంజూరు చేయించకపోగా.. ఇన్సూరెన్స్‌ చేయించిన కార్డులు పంపిణీ చేశారని బాధితులు తెలిపారు. మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలా అన్యాయం చేయడం నాయకులకు మంచిది కాదని వాపోయారు.  

రెండేళ్లుగా స్పందించలేదు  
గొర్రెల యూనిట్‌కోసం రూ.1600 డబ్బులు చెల్లిచాం. రెండేళ్లు పూర్తవుతున్నా మాకు గొర్రెలయూనిట్‌ మంజూరు కాలేదు. ఈ విషయంపై పలుమార్లు టీడీపీ నాయకుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందనా లేదు. 
– ఎం.సి.కుళ్లాయప్ప, ఏడుగురాకులపల్లి 

డబ్బులు వెనక్కు ఇవ్వలేదు  
గొర్రెలు ఇప్పించి మీకందరికీ న్యాయం చేస్తాం అంటూ ఒక్కొక్కరితో రూ.1600 వ సూలు చేశారు. ఇం తవరకూ గొర్రెలు ఇవ్వకపోగా, కనీసం మేంకట్టిన సొమ్మును కూడా వెనక్కు ఇవ్వలేదు. 
– బాసి రామాంజి, ఏడుగురాకులపల్లి 

ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీదు 
మా గ్రామంలో చాలామందితో గొర్రెలు ఇప్పిస్తామని ఒక్కొక్కరితో రూ.1600 చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేశారు. యూనిట్‌ మంజూరు చేయలేదు. మా డబ్బులు వెనక్కు ఇవ్వలేదు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియడం లేదు.  
– అరక మారెన్న,ఏడుగురాకులపల్లి  

>
మరిన్ని వార్తలు