ఎస్‌ఎస్‌ఏ పోస్టులకు పైరవీలు

11 Aug, 2019 13:11 IST|Sakshi
సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయం 

సాక్షి, నెల్లూరు (టౌన్‌) : సర్వశిక్ష అభియాన్‌ పోస్టులకు జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. పోస్టును దక్కించుకునేందుకు పలువురు జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ కింద 102 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ బాధ్యతను రూపేష్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీకి అప్పగించింది. దీంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే పోస్టును రూ.2 నుంచి రూ.3లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్‌ ముత్యాలరాజు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మెరిట్‌ ప్రకారం జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పోస్టులపై కదలిక వచ్చింది. రూపేష్‌ సంస్థ ఒక జాబితాను సిద్ధం చేసి సర్వశిక్ష అభియాన్‌కు పంపింది.  ఈ జాబితాలో నగదు తీసుకుని అనర్హుల పేర్లును చేర్చారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కాగా పోస్టులను దక్కించుకునేందుకు పలువురు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 

102 పోస్టుల భర్తీ 
సర్వశిక్ష అభియాన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ కింద 102 పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నవంబరు 11న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టుల భర్తీ బాధ్యతను రూపేష్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీకి అప్పగించింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.14 వేల నుంచి రూ.21వేల వరకు వేతనం ఇవ్వనున్నారు. ఎస్‌ఎస్‌ఏలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీపీఓ)–1, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (ఎంఆర్సీ)–1, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌–1, డీఎల్‌ఎంటీఎస్‌–1, కేజీబీవీ అటెండర్‌–1, సీఆర్పీలు–27, ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌–20, వర్క్‌ ఎడ్యుకేషన్‌–5, పీఈటీలు–45 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల విద్యార్హతను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఆరోపణలతో నిలిపివేత 
సర్వశిక్ష అభియాన్‌ అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోస్టుకు రూ.2లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకులు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి కలెక్టర్‌ ముత్యాలరాజు తాత్కాలికంగా పోస్టుల భర్తీని నిలిపివేశారు. మెరిట్‌ ప్రకారం జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు జిల్లాల్లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు  పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.

మళ్లీ ఈ పోస్టులపై కదలిక వచ్చింది. పోస్టులను భర్తీ చేయాలని మార్చిలో రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో పోస్టుల నియామకాన్ని పూర్తి చేశారు. జిల్లాలో మాత్రం నియామకాలను చేపట్టలేదు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో పోస్టుల భర్తీని నిలిపివేశామని ఎస్‌ఎస్‌ఏ అధికారులు చెబుతున్నారు. 

జోరుగా పైరవీలు 
సర్వశిక్ష అభియాన్‌లో అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల నియామకాలపై జోరుగా పైరవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పోస్టును దక్కించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ద్వారా రూపేష్‌ సంస్థకు నగదు ఇచ్చినట్లు సమాచారం. వారంతో ఇప్పుడు పోస్టులు ఇవ్వాలంటూ రూపేష్‌ సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. మరికొందరు అభ్యర్థులు నాయకుల ద్వారా జిల్లా ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

రూపేష్‌ సంస్థ నిర్వాహకులు మాత్రం రెండు నెలల క్రితమే జాబితాను ఎస్‌ఎస్‌ఏ అధికారులకు చేర్చామంటూ చెబుతున్నారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఎస్‌ఎస్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్‌ వద్దకు ఇంకా జాబితాను చేర్చలేదు. ఈ జాబితాపై కలెక్టర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. పోస్టుల భర్తీ నియామకంలో పైరవీలకు అవకాశమిస్తారో లేక మెరిట్‌ జాబితాను సిద్ధం చేసి అర్హత ఉన్న అభ్యర్థులకే పోస్టులు ఇస్తారో వేచి చూడాల్సిందే. 

వివరాలను పరిశీలించాల్సి ఉంది
రెండ్రోజుల క్రితమే ఇన్‌చార్జి పీఓగా బాధ్యతలు తీసుకున్నా. ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల వివరాలు తెలియదు. త్వరలో పోస్టుల నియామకాలపై కలెక్టర్‌ను సంప్రదించి అర్హులైన అభ్యర్థులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– జనార్దనాచార్యులు, ఇన్‌చార్జి పీఓ, ఎస్‌ఎస్‌ఏ

మరిన్ని వార్తలు