అక్రమాల వెలుగు!

23 Jun, 2019 08:42 IST|Sakshi

బాలబడులు, న్యూట్రిషన్‌ కేంద్రాల్లో రూ.కోటి దుర్వినియోగం

టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు

పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం

సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండాల్సిన వెలుగు శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు వెలికితీస్తే రూ.కోట్లలో కుంభకోణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. గతంలో న్యూట్రీషియన్, బాలబడుల కేంద్రాల్లో రూ.కోటి పైనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇతర జిల్లాలకు బదిలీతో సరిపెట్టేశారు. అప్పట్లో విచారణ పేరుతో కాలం గడిపేశారు తప్ప ఫలితం లేదు.

తాజాగా ఒక మండల మహిళా సమాఖ్యకు చెందిన సీసీయే రూ.31లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారంటే పర్యవేక్షణ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. రెండు, మూడేళ్లుగా ఈ అక్రమాలు గుట్టుగా చేస్తుంటే ఎందుకు పట్టించుకోకుండా సంబంధిత అధికారులు వదిలేశారనేది ప్రశ్నగా మారింది. దీనిలో పనిచేస్తున్న వారెవ్వరూ పర్మినెంట్‌ ఉద్యోగులు కాదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)పరిధిలో పనిచేస్తున్న 80 శాతం మంది వరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులే. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఏ పథకాలు అమలు చేస్తున్నారు, అసలు నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా? లేదా అనేది వెలుగు ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. కేవలం ఐటీడీఏ స్థాయిలో ఉన్నతాధికారులు పెట్టిన సమావేశాలకు హాజరు కావడం, వారికి కాకి లెక్కలు చూపించేసి మమ అనిపించేయడం పరిపాటిగా మారిపోయింది.

కొద్ది రోజులకే పరిమితమైన పుట్టగొడుగుల పెంపకం..
ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస మండలాల్లో 2015–16లో పుట్టగొడుగుల పెంపకం అని చెప్పి హడావుడి చేసిన అధికారులు కొద్దిరోజులకే మంగళం పాడేశారు. 171 పంచాయతీల్లో 107 మహిళా సంఘాలతో 107 గ్రామాల్లో 228 మంది మహిళా సభ్యులతో పుట్టగొడుగులు పెంపకం అనిచెప్పి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు జరిగిన దాఖలాలు లేవు. బంతి మొక్కలు పెంపకం చేపట్టడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇస్తామని తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ పథకం కూడా మూతపడింది. ఇందుకు సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించినట్టు చూపి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణే లేదు. తాజాగా స్త్రీనిధి రుణాలు, పసుపుకుంకుమ, గ్రామైఖ్య సంఘం నిధులు రూ.31 లక్షలు వివిధ ఖాతాలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు.

గత అక్రమాలు పరిశీలిస్తే...
గతంలో సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో 2014వ సంవత్సరంలో 110 బాలబడులను ఏర్పాటు చేశారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య ఉన్న చిన్నారులను బాలబడుల్లో చేర్పించి వారికి ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది లక్ష్యం. ఎంపిక చేసిన పీవీటీజీ (ప్రిలిమినరీ వలనర్‌బుల్‌ ట్రైబుల్‌ గ్రూప్‌) గ్రామాల్లో ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో చాలా గ్రామాల్లో సరిగా పనిచేయ లేదు. దీంతో పాఠశాలలను  పూర్తిగా ఎత్తివేశారు. ఈ బాలబడులకు ఆటవస్తువులు, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.50 లక్షల వరకు వెచ్చించినట్టు రికార్డుల్లో చూపించి, ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకుండా రూ.50 లక్షల వరకు కైంకర్యం చేశారు.

ఆరోగ్యం, పోషణ కేంద్రాల ఏర్పాటులో..
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి పీవీటీజీ గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. కొత్తూరు, సీతంపేట మండలాల్లో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మధ్యాహ్నం భోజనం, ఉదయం పాలు, కోడి గుడ్లు అందించాలి. చాలా గ్రామాల్లో ఈ పథకం అంటే ఎవరికీ తెలియని పరిస్థితి. వీటికి సంబంధించిన వంట పాత్రలు, ఇతర సామగ్రితో పాటు రూ.30 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కుంభకోణాలు నాకు తెలి యదు. లబ్ధిదారుడు తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే తప్ప..నేనేమి చేయలేను. ప్రస్తుతం తాము రుణాల రికవరీకి గ్రామాలకు వెళితే ఈ తరహా కుంభకోణం బయటపడింది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసు పెట్టడంతో పాటు నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. 
– డైజీ, వెలుగు ఏపీడీ, సీతంపేట

అక్రమార్కులపై చర్యలు తప్పవు
అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవు. వెలుగు అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలపై ముఖ్యమంత్రి కృష్టికి తీసుకువెళ్లి ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వంలో అక్రమార్కులకు కొంతమంది అధికారులు కొమ్ముకాసారు. ఎవరికి దొరికింది వారు దోచుకున్నారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తాం.
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు