‘వైకుంఠపురం’లో రూ.400 కోట్లు గోవిందా!

7 Sep, 2018 03:39 IST|Sakshi

రాజధాని ప్రాంతంలో బ్యారేజీ పనుల టెండర్లలో గోల్‌మాల్‌

తొలుత ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో నోటిఫికేషన్‌

తాజాగా ఈపీసీ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ

అస్మదీయ కాంట్రాక్టర్‌కే ప్రయోజనం చేకూర్చేలా టెండర్‌ నిబంధనలు

అంచనా వ్యయం రూ.446 కోట్లకు పైగా పెంపు

సాక్షి, అమరావతి: ఈ రెండు టెండర్‌ నోటిఫికేషన్లను పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ నిబంధనలను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. వైకుంఠపురం బ్యారేజీ టెండర్లలో చోటుచేసుకున్న గోల్‌మాల్‌ ఇదీ. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో ముఖ్యనేత యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారనడానికి ఇదో నిదర్శనం. పోలవరం ప్రాజెక్టులో నామినేషన్‌ విధానంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కే వైకుంఠపురం బ్యారేజీ పనులను సైతం అప్పగించాలని ముఖ్యనేత ముందే నిర్ణయించారు.

కానీ, జూలై 9న ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో జారీ చేసిన టెండర్లలో అస్మదీయ కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం ఉండదని అనుమానం వచ్చి, వాటిని రద్దు చేసేలా చక్రం తిప్పారు. తాజాగా ఈ నెల 5న వైకుంఠపురం బ్యారేజీ పనులతోపాటు బ్యారేజీ నుంచి రాజధానికి నీటిని సరఫరా చేసే పథకం పనులకు ఒకే ప్యాకేజీ కింద ఈపీసీ(ఇంజనీరింగ్‌–ప్రొక్యూర్‌మెంట్‌–కన్‌స్ట్రక్షన్‌) విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

జూలై 9న జారీ చేసిన టెండర్‌లో అంచనా వ్యయం రూ.801.88 కోట్లు. ఈపీసీ విధానంలో జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌లో ఐబీఎం అధికారికంగా ఇప్పటివరకూ నిర్ణయించలేదు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు రూ.1,239.21 కోట్లు. ఇందులో నీటి పథకం వ్యయం రూ.145 కోట్లకు మించదు. అంటే వైకుంఠపురం బ్యారేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.292.33 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి జూలై 9న జారీ చేసిన టెండర్ల సమయంలోనే అంచనా వ్యయం రూ.154 కోట్ల మేర పెంచేశారు. మొత్తం మీద బ్యారేజీ పనుల వ్యయాన్ని రూ.446.33 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యనేత జేబుల్లోకి రూ.400 కోట్లు
వైకుంఠపురం బ్యారేజీ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. బిడ్‌లు దాఖలు చేయడానికి తుది గడువు సెప్టెంబర్‌ 19. ఈ నెల 11న ప్రీబిడ్‌ సమావేశాన్ని విజయవాడలో కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌ నిర్వహించనున్నారు. 21న టెక్నికల్‌ బిడ్‌.. 25న ప్రైస్‌ బిడ్‌ తెరిచి ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌ నుంచి రూ.400 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో ముఖ్యనేతకు ముట్టనున్నాయి.


జూలై 9న లంప్‌సమ్‌(ఎల్‌ఎస్‌) ఓపెన్‌ విధానంలో జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌
పని పేరు: రాజధానిలో ప్రాంతంలో
వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం
నీటి నిల్వ సామర్థ్యం: 10 టీఎంసీలు
అంచనా వ్యయం: 801.88 కోట్లు

బిడ్‌ దాఖలు చేయాలంటే..
జాయింట్‌ వెంచర్లు(ఇద్దరు లేదా ముగ్గురు కాంట్రాక్టర్లు కలిసి) అనర్హులు.
 బిడ్‌ దాఖలు చేయాలంటే 2008–09 నుంచి 2017–18 వరకు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.200.47 కోట్ల విలువైన బ్యారేజీ పనులను పూర్తి చేసి ఉండాలి.
  బ్యారేజీ పనుల్లో 14.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 1.12 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేసి ఉండాలి. 2,710 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ను ఉపయోగించి గేట్లను ఒకే ఏడాదిలో తయారు చేసి ఉండాలి.
  కాంట్రాక్టర్‌ వద్ద రూ.120 కోట్ల మేర నగదు నిల్వ ఉండాలి.

సెప్టెంబర్‌ 5న ఈపీసీ విధానంలో జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌
పని పేరు: వైకుంఠపురం బ్యారేజీ, రాజధానికి
10 క్యూమెక్కుల నీటిని సరఫరా చేసే పథకం
నీటి నిల్వ సామర్థ్యం: 10 టీఎంసీలు
అంచనా వ్యయం: రూ.1,239.21 కోటు!్ల

బిడ్‌ దాఖలు చేయాలంటే...
 జాయింట్‌ వెంచర్లు అర్హులే. ఇందులో కాంట్రాక్టర్లు ముగ్గురికి మించకూడదు.
 గత పదేళ్లలో ఏదైనా ఒక ఏడాదిలో రూ.303 కోట్ల విలువైన బ్యారేజీ, నీటి పథకాల పనులు చేసిన అనుభవం ఉండాలి. ఒక ఏడాదిలో 13.96 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 1,58,850 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, 4,260 మెట్రిక్‌ టన్నుల స్టీలును వినియోగించి గేట్లు తయారు చేసి, అమర్చిన అనుభవం ఉండాలి.
 ఐదు క్యూమెక్కుల సామర్థ్యంతో 2 పంపులు, 2 మెగావాట్ల సామర్థ్యంతో రెండు మోటార్లు, 1.8 మీటర్ల వ్యాసార్ధం.. 2 కిలోమీటర్ల పొడవున ప్రెజర్‌మైన్‌ పనులు చేసి ఉండాలి.

మరిన్ని వార్తలు