సాగునీటి పంపిణీలో మాటలు తప్ప చేతలు లేవు..!

6 Mar, 2019 14:46 IST|Sakshi
తెర్లాం మండలం మీదుగా వెళ్తున్న తోటపల్లి ప్రధాన కుడి కాలువ

సాక్షి, తెర్లాం(శ్రీకాకుళం): సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువను మాత్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పిల్ల కాలువలు మంజూరయ్యాయని, వాటిని తవ్వేందుకు రైతుల నుంచి భూములు సేకరిస్తున్నామని అధికారులు పదేపదే చెప్పడమే మిగులుతుందే తప్ప ఇప్పటివరకు పిల్ల కాలువల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారుతున్నాయి’.

ఇదీ పరిస్థితి.. 
నియోజకవర్గంలోని తెర్లాం, బాడంగి, బొబ్బిలి మండలాలను కలుపుతూ తోటపల్లి ప్రధాన కుడికాలువను నిర్మించారు. ఈ కాలువ కింద సుమారు 30 వేల ఎకరాల వరకు మూడు మండలాలకు చెందిన భూములు ఉన్నాయి. వీటిలో తెర్లాం మండలంలోని తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు ఉండగా,  కేవలం మూడు పిల్ల కాలువల ద్వారా 4 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మిగిలిన భూములకు చుక్క సాగునీరు కూడా అందడం లేదని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

అంతంతమాత్రంగా పిల్ల కాలువల నిర్మాణం...
నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వెళ్తున్న తోటపల్లి ప్రధాన కుడి కాలువకు సంబంధించి బొబ్బిలి, బాడంగి మండలాలకు సంబంధించి ఇంతవరకు పిల్ల కాలువలను ఏర్పాటు చేయలేదు.  తెర్లాం మండలంలో 27 కిలో మీటర్ల పరిధిలో తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉండగా కేవలం మూడు పిల్లకాలువలను ఏర్పాటు చేసి, 4వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. తమ పొలాల మీదుగా, గ్రామాల మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉన్నా తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోతుందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మాటలు తప్ప చేతల్లేవ్‌..
తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు పదేపదే ప్రకటిస్తున్నా, అది కార్యరూపం దాల్చడంలేదు. బొబ్బిలి, తెర్లాం మండలాల్లో కొత్తగా పిల్ల కాలువల ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎటువంటి ఫలితం లేదని రైతులు అంటున్నారు.

ఇబ్బంది పడుతున్నాం..
తమ గ్రామం మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ వెళ్తోంది. మా గ్రామానికి పక్క గ్రామం వరకు పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. మా గ్రామానికి చుక్క నీరు కూడా రావడంలేదు. దీంతో తమ భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పిల్ల కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
–జమ్మల పెంటయ్య, రైతు, సతివాడ, తెర్లాం మండలం.

అధికారుల దృష్టికి తీసుకువెళతా..
తోటపల్లి ప్రధాన కుడి కాలువ నుంచి పిల్ల కాలువల ఏర్పాటుకు భూసేకరణ చేయాల్సి ఉంది. తోటపల్లి ఫేజ్‌–1కు సంబంధించి పిల్ల కాలువలు ఎక్కడెక్కడ ప్రతిపాదనలు చేశారో తెలియదు. ఫేజ్‌–2కు సంబంధించి పిల్ల కాలువ నిర్మాణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా.
– దొర, తోటపల్లి ప్రాజెక్టు ఫేజ్‌–2 ఏఈ, తెర్లాం.
 

మరిన్ని వార్తలు