గుండె చెరువు

24 Jun, 2019 10:47 IST|Sakshi
దిగువ ప్రాంతానికి వృథాగా పోతున్న నీరు

నీరు చెట్టు పనుల్లో నాణ్యత డొల్ల

తెగిన బొందలపాడు చెరువు రింగ్‌బండ్‌

నీరు–చెట్టు పనుల్లో అధికారులు, టీడీపీ నాయకుల చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. రూ.లక్షలు వెచ్చించి చేపట్టిన పనుల్లో డొల్ల వెలుగుచూసింది. దీర్ఘకాలం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరోసారి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. కరువుతో నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్న తరుణంలో అనుకోని అతిథిగా వచ్చిన వర్షం నీరు చెరువుకు చేరినా ఫలితం లేకపోయింది. చెరువు కట్ట మరమ్మతులకు గత ఏడాది మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో వర్షంనీటి ఉధృతికి రింగ్‌బండ్‌ తెగి పంటపొలాలపై నీరు ప్రవహించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

సాక్షి, మార్కాపురం : వర్షాకాల మొచ్చినా చెరువుల అభివృద్ధి, వాటి పనులను పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బొందలపాడు చెరువు కింద 80 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు నీరు వచ్చిన ప్రతిసారీ కట్ట తెగిపోవటం సర్వసాధారణమైంది. ఇరిగేషన్‌ అధికారులు ఏటా నీరు చెట్టు కింది కట్ట మరమ్మతుల పేరిట రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా కూడా చెరువుకు వచ్చిన నీరు వృథాగా పోతోంది. నీరు చెట్టు కింద 2017–18 సంవత్సరంలో నూతన తూము ఏర్పాటు చేయటానికి రూ. 8 లక్షలు నిధులు ఖర్చు చేశారు. ఇదే చెరువుకు గత ఏడాది కూడా మళ్లీ రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఆ నిధులతో తూము ఏర్పాటు చేయటంలో అధికారులు, కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యం వహించారు.

ఎట్టకేలకు ఇటీవల నెల కిందట నూతన తూమును ఏర్పాటు చేయటానికి పాత తూమును తొలగించారు. ఆ తూము ముందు రింగ్‌ బండ్‌ ఏర్పాటు చేశారు. కానీ ఆ రింగ్‌ బండ్‌లో నాణ్యతో లోపించటంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి చెరువుకు నీరు రావటంతో రింగ్‌ బండ్‌ తెగిపోయింది. అలాగే దీంతో పాటు చెరువు కట్టకు రంధ్రం పడి నీరంతా పంట పొలాలపై ప్రవహించింది. దీంతో ఐదెకరాల పత్తి పంట దెబ్బతింది. తనకు దాదాపు రూ. 1.5 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబో అంటున్నారు. ప్రతి ఏటా నీరు చెట్టు కింద టీడీపీ నాయకులు పనులు చేపట్టడం. అవి నాణ్యత లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

వర్షానికి తెగిన బొందలపాడు చెరువుకట్ట 
ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని బొందలపాడు చెరువుకు నీరు చేరింది. అయితే ఆ చెరువుకు కొంతమేర నీరు రావటం రింగ్‌ బండ్‌ తెగిపోయి అదంతా బయటకు వెళ్లిపోయింది. చెరువు కట్ట నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే రింగు బండ్‌ కొట్టుకు పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీరు వృథాగా పోవటంతో దిగువన ఉన్న ఐదెకరాలు పత్తి పంట నష్టం వాటిల్లింది.

దీంతో ఆ రైతు లబోదిబో మంటూ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కారకులపై ఫిర్యాదు చేయటం జరిగింది. రాకరాక వచ్చిన నీరు పోవడంతో పాటు,  చెరువుకట్టకు రంధ్రం పడటం, రింగ్‌బండ్‌ తెగిపోవడం మళ్లీ నిర్మాణం చేపట్టాల్సి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నాణ్యత లోపించే చెరువు రింగ్‌బండ్‌ తెగింది 
అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో రింగ్‌ బండ్‌ నిర్మాణంలో నాణ్యతో లోపించటం వల్లనే తెగింది. ప్రతి ఏటా నీరు చెట్టు కింద రూ. లక్షోల్లో నిధులు మంజూరు చేస్తున్నారు. అయితే నాణ్యత లేకుండా జరిగే పనులు వల్ల ఆతర్వాత వచ్చే వర్షానికి చెరువు కట్ట తెగిపోవటం పరిపాటి అయింది. అధికారులు పచ్చచొక్కాదారులకు కొమ్ముకాయడం వల్లే రైతులు నష్టపోతున్నారు. ఈ చెరువు నిండుతే నాలుగు గ్రామాలకు నీరు వస్తుంది.  ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించి సదరు కాంట్రాక్టర్‌ నుంచి రికవరీ చేయింలి.
తుమ్మా వెకంటేశ్వర రెడ్డి, బొందలపాడు

నీరు ఉధృతంగా రావటంతో రింగ్‌బండ్‌ తెగింది 
ఎగువ ప్రాంతంలో భారీ వర్షం పడి చెరువుకు ఉధృతంగా నీరు రావటం వల్లే ఆ రింగ్‌ బండ్‌ తెగింది. నాణ్యతాప్రమాణాలను తప్పక పాటించి పనులు సదరు కాంట్రాక్టర్‌తో చేయించటం జరుగుతుంది. మరళా వర్షాలు పడేలోపే చెరువు రంధ్రానికి, తూము ఏర్పాటు చేసి ఇలా మరలా అలా జరకుండా చర్యలు తీసుకుంటాం.
ఇరిగేషన్‌ ఏఈ రమణి   

మరిన్ని వార్తలు