నీటి దోపిడీ... నిజమే

17 Mar, 2016 03:22 IST|Sakshi
నీటి దోపిడీ... నిజమే

అన్నదాతల కడుపుకొట్టి.. రూ.కోట్లు కొల్లగొట్టారు
ఈఈపై వేటు వేసి తప్పించుకునే యత్నం
ఇరిగేషన్ అధికారుల రహస్య సమావేశం..
కలెక్టర్ చర్యలపై అధికారుల అసహనం
అధికారుల నిర్వాకంపై రగిలిపోతున్న రైతులు

 
 దేవుడు వరం ఇచ్చి జిల్లాకు 116 టీఎంసీల నీటిని అందించాడు. రైతుల ఆనందానికి అవధుల్లేవు. రెండు పంటలకు దిగుల్లేదనుకున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు, అధికారపార్టీ నేతల ఆగడాలతో రెండో పంట నీటికోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సి వచ్చింది.  న్యాయంగా రావాల్సిన నీటి వాటాను పంపిణీ చేయాల్సిన అధికారులు వాటిని అమ్ముకున్నారన్న అపప్రదను మూటకట్టుకోవాల్సి వచ్చింది. వారి నిర్వాకం తెలిసి రైతులు రగిలిపోతున్నారు.
 
సోమశిల నుంచి బకెట్ నీళ్లు కూడా వృథాగా పో లేదు.. చెంబు నీళ్లు అక్రమంగా ఇవ్వలేదు.. రైతు ల శ్రేయస్సే ధ్యేయంగా నీటి ని అందించాం.. ఇవి ఇరిగేషన్ అధికారులు తియ్యగా చెప్పిన ‘నీటి’ సూక్తులు.  
 
ఒక్క నీటిబొట్టును వృథా చే యం.. ఒక్క టీఎంసీతో 10వేల ఎకరాలు పండిస్తాం..ఇవీ తరచూ అధికారపార్టీ నాయకులు చేసే  ఆర్భాటం. ఇందుకుభిన్నంగా సో మశిలలో అక్రమాలు జరిగాయి. ఆచర్యల్లో భాగంగానే  ఈఈపై సస్పెన్షన్ వేటు. దీంతో నీటిస్వా హా నిజమేనని తేలిపోయింది.
 
  ఏ మేరకు నీరు అక్రమం గా పంపిణీ చేశారు, ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయన్న అంశంపై విచారణ జరగాల్సి ఉంది. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని కేవలం ఈఈపై వేటువేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : గత డిసెంబర్ 12న జరిగిన ఐఏబీ మీటింగ్ నాటికి సోమశిల జలాశయంలో 66.7 టీఎంసీల నీరు ఉంది. అదేనెల 18వ తేదీ నుంచి నీటి పంపిణీ ప్రారంభించారు. సరిగ్గా నెలకు సోమశిల జలాశయం నీటి మట్టం 53 టీఎంసీలకు చేరుకుంది. నీటి ఆవిరి, లీకులవల్ల జరిగే వృథాను అంచనా వేసి కేటాయింపు లు చేస్తారు. అయితే పంపిణీ అయిన 12 టీఎంసీలలో కాలువలు బలహీనంగా ఉండటంతో రోజు వారీ విడుదల చేస్తున్న నీరు సంగం వృథా అవుతుందని అప్పట్లో అందరూ అపోహపడ్డారు. ఐఏ బీ తీర్మానం ప్రకారం ఖరీఫ్ పంటకు పెన్నార్ డెల్టా కు 20.445 టీఎంసీలు, కనుపూరు కాలువకు 1.934 టీఎంసీలు, కావలి కాలువకు 2.881, నార్త్‌ఫీడర్ 4.781, సౌత్‌ఫీడర్ 1.884 టీఎంసీల నీటిని కేటాయించారు. అయితే రోజువారి కాలువలకు పంపిణీల్లో పూర్తిస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళనలు ప్రారంభిం చారు. దీంతో కొంత నీరు వృథాగా పోయిందని అప్పట్లో అధికారులు నమ్మబలికారు.

 నీటిని అమ్ముకున్నారు
కాలువలపై పర్యవేక్షణ లోపం, లష్కర్లు లేకపోవడంతోపాటు స్థానిక అధికారపార్టీ నాయకుల ఆగడాలతో నీటిని ఇష్టం వచ్చినట్లు పొలాలకు వదులుకున్నారు. ఇదే అదనుగా భారీ ఆయకట్టు ఉన్న రైతులకు నీటిని అమ్ముకున్నారన్న వాస్తవం ప్రస్తు తం రైతాంగం జీర్ణించుకోలేకపోతుంది. కావలి, కనుపూరు కాలువల ద్వారా అక్రమ నీటి పంపిణీతో రూ.కోట్లు అధికారులు తమ జేబుల్లో వేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మోటార్ల విని యోగంపై ప్రభుత్వానికి రావాల్సిన రూ.40కోట్లు అధికారులు నొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. మోటార్‌కు రూ.10వేలు చొప్పున వసూ లు చేశారని రైతులు చెబుతున్నారు.

 నీటి ‘కాకి’లెక్కలు...
24 టీఎంసీల నీటి గల్లంతుపై కలెక్టర్ నివేది కలు ఇవ్వాలంటూ తహశీల్దార్లను సోమశిలకు పంపిన రోజునే 4 టీఎంసీల నీటి లెక్కలు తేలకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ సంబంధిత ఈఈని సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

 ఉన్నతస్థాయి అధికారులతోనే..
సదరు ప్రాజెక్ట్‌లో నీటిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈఈ స్థాయి వ్యక్తి పంపిణీ చేయరని కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతస్థాయి అధికారులతోనే నీటి అమ్మకాలు జరిగి ఉంటాయనేది వారి వాదన. పథకం ప్రకారమే అధికారులు నీటిని అమ్ముకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
 పథకం ప్రకారమే అమ్ముకున్నారు..
 విస్తారంగా నీరు ఉన్నప్పటికీ పథకం ప్రకారమే ఇరిగేషన్ అధికారులు నీటి ని అమ్ముకున్నారని తేలి పోయింది. నీరు-చెట్టు, ఎఫ్‌డీఆర్ పనుల్లో సైతం భారీ అవి నీతి చోటుచేసుకుంది. నాయకుల అండదండలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా వారిని కట్టడి చేసి రైతులను ఆదుకోవాల్సి ఉంది. - బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు
 
 ఐఏబీ మీటింగ్ అప్పుడే చెప్పాం..
 ఎన్నడూలేని విధంగా చిత్తూ రు జిల్లా ఆయకట్టుకు నీటిని కేటాయించడం సరికాదని అప్పుడే చెప్పాం. అయినా  కేటాయించారు. ఆ పంపిణీపై ఇంతవరకు ఎవరూ నోరు మెదపడంలేదు. మరి నీరు ఎటుపోయింది.    - నిరంజన్‌రెడ్డి, రైతు నాయకులు

మరిన్ని వార్తలు