20 ఏళ్లైనా ప్రాజెక్టులు పూర్తికావు

6 Sep, 2014 02:20 IST|Sakshi
20 ఏళ్లైనా ప్రాజెక్టులు పూర్తికావు

* సాగునీటి పద్దుపై జరిగిన చర్చలో ప్రభుత్వ తీరును తూర్పారబట్టిన విపక్ష సభ్యులు
* తుది దశలో ఉన్న ప్రాజెక్టులకూ నిధులివ్వలేదు
* విధానాలు మార్చుకొని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
* చంద్రబాబు శంకుస్థాపనలు మాత్రమే చేశారు
* కాటన్ తర్వాత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత వైఎస్సే
* చంద్రబాబు చేసిందేమీ లేకే జలయజ్ఞంపై ఆరోపణలు
* 2004 ధరలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?

 
సాక్షి, హైదరాబాద్: ఈ బడ్జెట్‌లో సాగునీటి శాఖ కేటాయింపులను చూస్తే 20 సంవత్సరాలైనా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఏ ప్రాజెక్టుకు ఏ నాయకుడు నిధులిచ్చి పూర్తిచేశారనే విషయం ప్రజలకు తెలుసని, శంకుస్థాపనలతో మభ్యపెట్టిన నాయకుడు ఎవరో కూడా ప్రజలకు అవగాహన ఉందనే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు మరిచిపోకూడదని హితవు చెప్పారు. చంద్రబాబు తన తొమ్మిది సంవత్సరాల పాలనతో ఇంకుడుగుంతలతో సరిపెట్టారని, ఫలితంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్‌ను చూసి భయపడుతున్నారని విమర్శించారు. అందుకే 2004 తర్వాత 23 లక్షల ఎకరాలను సాగులోకి వచ్చిందని బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక మంత్రి, 2004కు ముందు సాగులోకి వచ్చిన భూమి గురించి చెప్పడానికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సాగునీటి పద్దుపై శాసనసభలో శుక్రవారం చర్చ జరిగింది. చర్చలో ఎవరేం మాట్లాడారంటే..
 
 నిరాశ కలిగించిన బడ్జెట్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
 -    బడ్జెట్‌లో సాగునీటి కేటాయింపులు రైతులను తీవ్ర నిరాశ, నిస్పృహలు కలిగించాయి. వైఎస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని తుది దశకు వచ్చాయి. 10 శాతం పనులు మిగిలిన ప్రాజెక్టులు తక్కువ ఖర్చులో పూర్తి చేయవచ్చు. తద్వారా కొన్ని వేల ఎకరాలకు నీరందించవచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఈ బడ్జెట్‌లో తెలుగుగంగ ప్రాజెక్టుకు రూ. 89 కోట్లు, గాలేరు- నగరికి రూ.55కోట్లు ఇచ్చారు. ఇలా నిధులిస్తే 20 ఏళ్లయినా ప్రాజెక్టులు పూర్తికావు. బాబు విధానాలు మార్చుకొని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
 -    వైఎస్ హయాంలో సృష్టించిన అదనపు ఆయకట్టు వల్ల ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో 17 శాతం మన దేశంలోనే ఉన్నారు. విస్తీర్ణంలో మనది రెండు శాతమే. మరి అందరికీ ఆహారం అందించాలంటే ప్రతి ఎకరాకూ నీరివ్వాలి.
 -    2001కి ముందు తెలుగుగంగ, ఎస్‌ఆర్బీసీ మినహా మరో ప్రాజెక్టునే చేపట్టలేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃపరిశీలన జరుగుందని తెలిసినా.. చంద్రబాబు ప్రాజెక్టులు నిర్మించాలనే ప్రయత్నమే చేయలేదు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మించుకొని బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డులో నికర జలాలు పొందగలిగారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు నిబంధలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ రికార్డులను స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.
 
చంద్రబాబు నాయుడు 10 లక్షల ఎకరాలకు నీరిచ్చారు: చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు
 -    చంద్రబాబు హయాంలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి 10 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. వైఎస్ రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలే సాగులోకి తెచ్చారు. సీమ ప్రాజెక్టులకు నికర జలాలు లేకుండా మిగుల జలాలపై ఆధారపడే పరిస్థితి రావడానికి వైఎస్ అప్పట్లో దాఖలు చేసిన మెమో కారణం.
 ప్రాజెక్టులు పూర్తైతే రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు: టీడీపీసభ్యుడు ఆంజనేయులు
 -    జలయజ్ఞంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే 2004-14 మధ్య రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. జలయజ్ఞంలో అవినీతివల్లే ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి నిధులు దోచుకున్నారు.
 
 కాటన్ తర్వాత వైఎస్సే: జగ్గిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సభ్యుడు
 -    గోదావరి జిల్లాల్లో సర్ ఆర్ధర్ కాటన్ పట్ల ఆరాధనా భావం ఉంటుంది. నీళ్లిచ్చిన వారిని మరిచిపోని తత్వం గోదావరి జిల్లాల ప్రజలకు ఉంది. కాటన్ తర్వాత ఆ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు వైఎస్. కాటన్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఆధునీకరణకు వైఎస్ నిధులిచ్చారు.
 -    2004 తర్వాత 23 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2004కు ముందు సాగులోకి వచ్చిన భూమి గురించి చెప్పడానికి ఆర్థిక మంత్రికి మనసు రాలేదు.
 -    చంద్రబాబు తన తొమ్మిది సంవత్సరాల పాలనతో ఇంకుడుగుంతలతో సరిపెట్టారు. సాగునీటి రంగానికి ఆయన చేసిందేమీ లేకపోవడం వల్లే.. జలయజ్ఞం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్ పట్ల ఉన్న భయాన్ని బయటపెట్టుకుంటున్నారు. జలయజ్ఞాన్ని విమర్శించేది అందుకే. ఏం చేస్తారో చెప్పండని ప్రజలు అధికారం ఇస్తే.. లేనిపోని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.
 -    స్థూల సాగు విస్తీర్ణం చంద్రబాబు హయాంలో 41.59 శాతం నుంచి 38.28 శాతానికి తగ్గిపోయింది. వైఎస్ దాన్ని 46.19 శాతానికి పెంచారు. సాగునీటి ప్రాజెక్టులు లాభదాయకం కాదని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకం 125 పేజీలో పేర్కొన్నారు. అంచనా వ్యయం పెంచారని టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. 2004 ధరలతో ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయగలమని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? రూ. 91.12 కోట్ల అంచనా వ్యయంతో నాగార్జున సాగర్‌ను ప్రారంభిస్తే.. పూర్తయ్యే నాటికి రూ. 1300 కోట్లు ఖర్చయింది.
 
 హంద్రీనీవాకు ఎన్ని శంకుస్థాపనలు చేశారు?: ఎస్వీ మోహన్‌రెడ్డి
 -    హంద్రీనీవా సుజల స్రవంతికి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబూ చేశారు. రూ. 6,850 కోట్ల అంచనా వ్యయం ఉండగా, చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ. 13 కోట్లే. వైఎస్ 2004-10 మధ్య రూ.3,996 కోట్లు నిధులు విడుదల చేశారు. తర్వాత ప్రభుత్వాలు రూ. 1800 కోట్లు ఇచ్చాయి. హంద్రీనీవాను కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నారు. ప్రాజెక్టును ఎవరు పూర్తి చేసినట్లు?
 -    రూ. 391 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు కూడా చంద్రబాబే శంకుస్థాపన చేశారు. ఇచ్చిన నిధులు రూ. 3 కోట్లే. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 142 కోట్లు ఖర్చు చేసి 6,718 ఎకరాలను సాగులోకి తెచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు కూడా ఎక్కువ నిధులిచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది.
 -    గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ బడ్జెట్‌లో నిధులివ్వలేదు. కర్నూలుకు దిగువన తుంగభద్ర మీద ‘చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జి’ నిర్మించాలని చిన్ననీటి పారుదల శాఖ గతంలో ప్రతిపాదనలు రూపొందించింది. కర్నూలుకు ఎగువన నిర్మిస్తే తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా