ఇతను రౌడీషీటర్ కాదా?

25 Sep, 2014 01:48 IST|Sakshi
ఇతను రౌడీషీటర్ కాదా?

సాక్షి ప్రతినిధి, అనంతపురం :
 పక్క ఫొటోలో తీక్షణంగా చూస్తున్న వ్యక్తి పేరు రాము అలియాస్ నల్ల రాము. ఈయన 23వ వార్డు పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కమిటీలో ‘సంఘ సేవకుడి’ హోదాలో ఉన్నాడు. ఎంపిక కమిటీకీ ఇతని పేరును ప్రతిపాదించింది అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి. ఈ విషయమై ‘వైకుంఠ పాళి’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం పచురితమైన విషయం తెలిసిందే. పింఛన్ లబ్ధిదారుల కమిటీల్లో ‘సంఘ సేవకుల’ పేరుపై నేర చరితులను, రౌడీషీటర్లను ఎమ్మెల్యే ప్రతిపాదించడంలోని ఔచిత్యాన్ని ఆ కథనంలో ప్రశ్నించడం.. దానిపై ఎమ్మెల్యే వివరణ కూడా ఇచ్చిన విషయం విదితమే. రౌడీషీటర్లను ‘సంఘ సేవకుల’ కోటా కింద ప్రతిపాదించడంపై ఎమ్మెల్యే వివరణ అడిగినపుడు జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా.. ‘నేను ప్రతిపాదించిన వ్యక్తులు.. మీరు పేర్కొంటున్న రౌడీషీటర్లు ఒకటే అన్న గ్యారంటే ఏమిటి? పేర్లు ఒకటిగా ఉన్నంత మాత్రాన వారే వీరని ఎలా చెప్పగలర’ంటూ దబాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నగరంలో పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. 23వ వార్డు కమిటీలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన రాము ‘సంఘ సేవకుడి’ అవతారంలో పాలుపంచుకున్నాడు. ‘సాక్షి’ రౌడీషీటర్‌గా పేర్కొన్న రాము.. ఎమ్మెల్యే ప్రతిపాదించిన రాము ఒక్కరే అనేందుకు ఈ ఫొటోనే సజీవ సాక్ష్యం.
 ఎమ్మెల్యే ‘సంఘ సేవకుడి’గా ప్రతిపాదించిన రాముపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నాటుబాంబులు కలిగి ఉండటం, హత్యాయత్నం, ప్రభుత్వ అధికారుల ఉత్తర్వుల ఉల్లంఘన, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్, వేరే వ్యక్తుల స్థలాల్లోకి అక్రమంగా చొరబడి ఆస్థి నష్టం కలిగించడం తదితర నేరారోపణలతో ఐదు వే ర్వేరు కేసులు నమోదయ్యాయి. ఇంత నేరచరిత ఉన్న వ్యక్తిని ‘సంఘ సేవకుడి’గా ఎమ్మెల్యే ఎలా ప్రతిపాదించారో? పత్రికల వారిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేశారా..? లేక పత్రికల వారిని కన్ఫ్యూజ్ చేయబోయి తానే కన్ఫ్యూజన్‌లో పడిపోయి ఇలా చేశారా అన్న విషయం ఎమ్మెల్యేనే తెలపాల్సి ఉంది. ఒక రౌడీషీటర్ సంఘ సేవకుడిగా మారకూడదా? అతనిలో పరివర్తన తీసుకు రాలేమా..? అని ‘అవే’ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్న ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి ప్రశ్నించవచ్చు. పరివర్తన తీసుకు రావడం అంటే వైఖరిలో మార్పు రాని రౌడీషీటర్ల పేర్లను ‘సంఘ సేవకుల’ జాబితాలో చేర్పించడమా..? అన్న జనం ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాగా ఈ వార్డు పింఛన్ ఎంపిక కమిటీ కన్వీనర్, కార్పొరేషన్ ఉద్యోగి అయిన లక్ష్మినరసింహ మూర్తిని కమిటీ గురించి వివరణ కోరగా ‘సంఘ సేవకుల’ కింద రాము తదితరులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారని, ప్రక్రియ రేపు కూడా కొనసాగుతుందన్నారు. లబ్ధిదారుల రద్దీ కారణంగా సంబంధింత ఫారాలపై కమిటీ సభ్యులు ఇంకా సంతకాలు చేయలేదని, రేపు ఎంపిక పూర్తి కాగానే అన్ని ఫారాల మీదా సంతకాలు తీసుకుంటానని తెలిపారు.
 ఐదో డివిజన్‌లో అడ్రస్‌లేని ‘సంఘ సేవకులు’
 అనంతపురంలోని ఐదో డివిజన్ కమిటీకి బాలరాజు పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించారు. బాలరాజు అనే వ్యక్తి పేరు కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ల జాబితాలో ఉంది. ఆ రౌడీ షీటర్, ఎమ్మెల్యే ప్రతిపాదించిన వ్యక్తి ఒకరేనా? కాదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ‘సాక్షి’ అక్కడకు వెళ్లింది. ఆ డివిజన్‌లో కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి పక్కన కూర్చొని ఉండగా ఆమె భర్త ఎన్నిక ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడం కనిపించింది. అక్కడ ‘సంఘ సేవకుల’ జాబితా కింద ఎమ్మెల్యే ప్రతిపాదించిన బాలరాజుతో సహా ఎవరూ కనిపించలేదు. ఈ విషయమై సంబంధిత కమిటీ కన్వీనర్ ఎస్‌ఆర్‌పీ బాబును ప్రశ్నించగా.. బుధవారం పింఛన్ దారుల ఎంపిక కార్యక్రమానికి ‘సంఘ సేవకులు’ ఎవ్వరూ హాజరు కాలేదని, ఒక వేళ రేపు హాజరైతే రేపు జరిపే ఎంపిక జాబితాలో మాత్రమే వారి సంతకాలు తీసుకుంటానని తెలిపారు.  


 

మరిన్ని వార్తలు