బాలయ్యా.. తేల్చవయ్యా..

27 Feb, 2014 10:12 IST|Sakshi
బాలయ్యా.. తేల్చవయ్యా..

అనంతపురం :  తెలుగుదేశం పార్టీలో టికెట్ల చిక్కుముడి నెలకొంది. ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల నుంచి కాకుండా పక్క స్థానాలపై కన్నేయడంతోనే ఆ పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రానున్న ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఇదే జరిగితే పెనుకొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీకే పార్థసారధికి హిందూపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కొందరు జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. బాలకృష్ణను హిందూపురం అసెంబ్లీకి పోటీ చేయిద్దామా? పార్లమెంట్ స్థానానికి పోటీ చేయిద్దామా? అన్న విషయం కొలిక్కి రాలేదని.. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక మిగిలిన విషయాలు చర్చిద్దామని చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

దీంతో పార్టీలో టికెట్ల చిక్కుముడి వీడాలంటే ముందుగా బాలయ్య పంచాయితీ తెగాల్సి ఉంటుంది. కాగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే టికెట్ల వ్యవహారం కొలిక్కి వచ్చినా.. అనంతపురం జిల్లాకు సంబంధించి మాత్రం బాబు ఓ అవగాహనకు రాలేకపోతున్నట్లు సమాచారం. కాగా జేసీ సోదరులను పార్టీలోకి చేర్చుకునే విషయమై నేతలను ఒప్పించే విషయంలోనూ.. బాలయ్య వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి మళ్లీ ఓసారి కూర్చుందామని జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులతో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో అనంతపురం, శింగనమల, గుంతకల్లు, రాయదుర్గం నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు నడిపించే వారు కరువయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే బలపడే అవకాశం ఉందని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అధినేతపై కొందరు ఒత్తిడి తెచ్చినా ఫలితం లే నట్లు సమాచారం.

శింగనమల నియోజకవర్గంలో ప్రస్తుతం నాయకులెవ్వరూ లేకపోవడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి మంత్రి శైలజానాథ్‌ను టీడీపీలోకి చేర్చుకునే విషయమై కొందరు నాయకులు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ సమయంలో ఇప్పటికే జేసీ సోదరులకు అవకాశం ఇస్తున్నామని, శైలజానాథ్‌ను చేర్చుకుంటే ఒకే పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని, ప్రస్తుతానికి జేసీ సొదరులతోనే సరిపెట్టుకుందామని చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో టికెట్ల వ్యవహారం కొత్త సమస్యలను తెచ్చిపెట్టేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు