కొత్త పార్టీ పెట్టలా.. వద్దా ?

20 Feb, 2014 02:09 IST|Sakshi
కొత్త పార్టీ పెట్టలా.. వద్దా ?

* కిరణ్‌కుమార్‌రెడ్డి తర్జనభర్జనలు
* ఎంతమంది వెంట వస్తారు?
* ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి?
* నేతలతో భేటీలో ఎటూ తేల్చని కిరణ్
* భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకపోవడంపై మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
 
 సాక్షి, హైదరాబాద్:  భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? కొత్త పార్టీపెట్టాలా? వద్దా? పార్టీ పెడితే ఎంతమంది నేతలు వెంట వస్తారు? విభజన జరిగిపోయూక ఏం చెప్పి ప్రజల ముందుకు వెళ్లాలి? ప్రస్తుత పరిస్థితుల్లో వారు విశ్వసించే అవకాశం ఉందా?... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాలపై తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆపుతానని, ఇంకా చివరి బంతి ఉందంటూ ఇప్పటివరకు చెప్పుకొచ్చిన కిరణ్  ఏ దశలోనూ టీ బిల్లు ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అడ్డుకోలేక పోయూరు. సీఎం చివరి బంతితో విభజన ఆగుతుందనే నమ్మకంతో ఇప్పటివరకు ఆయన వెంట నడిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడం, చివరకు కిరణ్ చేతులెత్తేయడంతో ఒక్కసారిగా దిగాలుపడ్డారు. అటు కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితి లేక, ఎటు వెళ్లాలో, తమ రాజకీయ భవితవ్యమేమిటో అర్థంకాక ఆందోళనలో పడ్డారు. సీఎం పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా కిరణ్  రాజీనామా చేయడంతో ఏం చేయూలో పాలుపోని అయోమయంలో ఉన్నారు.
 
 ఆలోచిద్దాం.. ఎంపీలతో చర్చిద్దాం: కిరణ్
 బుధవారం కిరణ్‌కుమార్‌రెడ్డితో పలువురు నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అయితే కిరణ్ నుంచి వారికి ఎలాంటి స్పష్టత రాలేదు. కొత్త పార్టీ పెడతానని కానీ, పెట్టనని కానీ ఆయన వారికి చెప్పలేదు. ‘‘సీఎంగా పనిచేశాను. ఇంతకుమించిన ఉన్నతావకాశం ఇంకేముంటుంది. ఇప్పటివరకు నా జీవితం సంతృప్తిగానే సాగింది. కొత్త పార్టీ పెట్టాలా? వద్దా? అన్నది ఆలోచిద్దాం’’ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కొత్త పార్టీ పెట్టి సమైక్య రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సైతం ఎదిరించి చివరివరకు మేమే పోరాటం చేశామని ప్రజల్లో చె ప్పుకోవడానికి అవకాశముందని కొంతమంది నేతలు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం విభజనను అడ్డుకోలేకపోయామన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా ఉందని, ఈ సమయంలో ఏం చెప్పినా వారు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. సీఎం మాత్రం తన మనసులోని మాటను బయటపెట్టకుండా.. ‘‘ప్రజలు ఏమనుకుంటున్నారో నియోజకవర్గాల్లో తెలుసుకోండి. తర్వాత నిర్ణయం తీసుకుందాం. 21తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున 22నాటికి ఎంపీలు కూడా రాష్ట్రానికి వస్తారు. ఆ తరువాత సమావేశమవుదాం..’ అని అన్నారు.
 
 ఎటూ కాకుండా పోతున్నాం: నేతలు
 సీఎంతో భేటీ తరువాత మంత్రులు, ఇతర నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. బ్రహ్మాస్త్రముందన్నారని ఇప్పటివరకు సీఎంను నమ్ముకొని ఉంటే చివరకు ఎటూకాకుండా పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను నమ్ముకొని సీనియర్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఇబ్బందుల పాలయ్యారని ఒక మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీలు రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్, లగడపాటి, సాయిప్రతాప్ తదితరులంతా సీఎంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, చివరికిలా అవుతుందని వారూ ఊహించలేదని చెప్పారు. కిరణ్‌ను నమ్ముకొని లగడపాటి పార్లమెంటులో పెప్పర్‌స్ప్రే వినియోగించడంతో జాతీయస్థాయిలో విమర్శలపాలయ్యారని, చివరకు రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చిందని బుధవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఒక మంత్రి వాపోయారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కావూరి, రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్ వంటివారు ఇప్పటివరకు కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్నారని ఇప్పుడు వారి పరిస్థితీ దయనీయంగా మారిందని చెప్పారు.
 
 పార్లమెంటు భేటీ ముగిసే వరకు కిరణే సీఎం!
 పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు సీఎంగా తానే కొనసాగుతానని కిరణ్‌కు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని, భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలు భావించారు. కానీ సీఎం అలాంటి ప్రకటనేదీ చేయలేదు. ఆలోచిద్దాం, 22న సమావేశమవుదాం వంటి మాటలతోనే సరిపెట్టారు. ఆపద్ధర్మ సీఎంగానూ కొనసాగబోనని చెప్పిన ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకపోవడానికి.. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు సీఎంగా తానే ఉంటాననే ముందస్తు సమాచారం ఉండటమే కారణమని పలువురు నేతలంటున్నారు. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనని కిరణ్ చెప్పినా గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించక పోవడంలోని రహస్యం కూడా ఇదేనని చెబుతున్నారు.  
 
 సీఎం రాజీనామా అప్రస్తుతం: బొత్స
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వంటి సున్నితమైన అంశం ముందు సీఎం రాజీనామా అప్రాధాన్యమైందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయ అంశాలు ఇప్పుడు అప్రస్తుతమని, దానిపై హైదరాబాద్ వెళ్లాక స్పందిస్తానని చెప్పారు. బుధవారం  ఢిల్లీలో సీఎం రాజీనామా అంశంపై విలేకరులు ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. రాష్ట్ర విభజన బాధాకరమైన నిర్ణయమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పారు.
 
 ఆఖరి నిమిషంలో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కొన్ని ప్రతిపాదనలు జీవోఎంకు సమర్పించినట్టు తెలిపారు. వెనుకబడిన  ప్రాంతం నుంచి వచ్చినవాడిగా ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పన, హైదరాబాద్‌ను యూటీ చేయడం, రాయలసీమలోని కర్నూలు, అనంతపురాన్ని తెలంగాణలో కలపడం, పోలవరం ముంపు గ్రామాల్లో 131 గ్రామాలు కాకుండా తెలంగాణకు ఏ ఇబ్బంది లేని రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపడం సహా మొత్తం ఐదు ప్రతిపాదనలు వారి దృష్టికి తెచ్చానన్నారు. వీటిని రాజ్యసభలో చర్చ సందర్భంగా బిల్లులో చేర్చుతామని జీవోఎం సభ్యులు హామీ ఇచ్చారన్నారు.

>
మరిన్ని వార్తలు