రాజకీయ లబ్ధి కోసమే వి‘భజన’

5 Dec, 2013 03:44 IST|Sakshi

తిరుపతి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతోందని సమైక్యవాదులు మండి పడుతున్నారు. దిగ్విజయ్, ఆంటోనీ వంటి వృద్ధుల సలహాలు తీసుకున్నంత కాలం కాంగ్రెస్ బాగుపడదని శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర సమైక్యత కోసం తుదికంటా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగాయి.

తిరుపతి తుడా సర్కిల్‌లో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షల్లో 50వ డివిజన్ పరిధిలోని ప్రశాంతినగర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దీక్షా శిబిరానికి వచ్చి వారికి సంఘీభావంగా కాసేపు శిబిరంలో కూర్చున్నారు. టౌన్ క ్లబ్  కూడలిలో మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పాల్గొని విభజన విషయంలో కాంగ్రెస్ కుట్రలను వివరించారు.

ఆయన కొబ్బరి బోండాంలు అమ్మి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడు కునేందుకు తమ పార్టీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తుదికంటా పోరాడుతుందన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మదనపల్లెలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి మల్లికార్జున సర్కిల్‌లో సోనియాగాంధీ దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఎన్జీవో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. పలమనేరులో టీడీపీ, కాంగ్రెస్ దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించారు.
 

మరిన్ని వార్తలు