దౌర్జన్యం చేస్తున్నారు

10 Jul, 2015 02:51 IST|Sakshi

ముదిగుబ్బ : రోడ్డుపక్కన వేసుకున్న బంకులను తొలగించాలంటూ అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని  ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వ్యాపారులు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురువారం పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలోని ముదిగుబ్బలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు హారతులు పట్టారు.
 
  స్థానిక బస్‌షెల్టర్ వద్ద ముదిగుబ్బలోని దుకాణదారులు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. 200లకు పైగా కుటుంబాల వారు బంకుల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నట్లు వివరించారు. ఏళ్ల తరబడి బంకులు వేసుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు  దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. బంకులను తొలగిస్తే ఉపాధి కోల్పోతామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు ఆయన స్పందిస్తూ  అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీలో సమస్యను లేవనెత్తుతామన్నారు.
 
 గోరంట్లలో ఘన స్వాగతం
 గోరంట్ల : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గోరంట్లలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు గుమ్మయ్యగారిపల్లి సర్కిల్‌కు చేరుకొని స్వాగతం పలికారు. వాహనంలోంచి దిగిన జగన్ అందరినీ చిరునవ్వుతో పలకరించడంతో పాటు కరచాలనం చేశారు. అక్కడికి వచ్చిన మహిళలను , చిన్నారులను ప్రత్యేక పలకరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గంపల వెంకటరమణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు, సహకార సంఘాల అధ్యక్షులకు పార్టీ తరఫున నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహించాలని జగన్‌ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
 
 కార్యక్రమంలో  రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు చందమూరి ఆదిరెడ్డి, ఎమ్పీటీసీ సభ్యులు గంగిరెడ్డి, ధనుంజయరెడ్డి,  గిరిధర్‌గౌడ్, జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్‌ఏ బాషా,   పార్టీ మహిళా విభాగం మండల కన్వీనర్ తబితాలియోనా, మైనార్టీ విభాగం మండల శాఖ అధ్యక్షులు చాంద్‌బాషా, షేక్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు