రుణాల రీషెడ్యూల్కు అవకాశం లేదా?

28 Jul, 2014 21:19 IST|Sakshi
రుణాల రీషెడ్యూల్కు అవకాశం లేదా?

హైదరాబాద్: సగటు పంట దిగుబడి 50 శాతం కన్నా తక్కువగా ఉంటేనే వ్యవసాయ రుణాల రీషెడ్యూల్‌కు అర్హత ఉంటుందని ఆర్బిఐ  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపాలి పంత్‌ జోషి ఏపీ ప్రభుత్వానికి  లేఖ రాశారు. రుణాల రీషెడ్యూల్‌ కోసం ఏపీ సర్కారు చెబుతున్న కారణాలు అంగీకారయోగ్యంగా లేవని రిజర్వ్‌బ్యాంక్‌ పేర్కొన్నట్లు పిటీఐ తెలిపింది.  ఏపీ సర్కార్‌కు ఇది పెద్ద షాక్‌ అని పీటీఐ తన కథనం వివరించింది.

జులై 26న  ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు ఆర్బిఐకి లేఖ రాశారు.  ఆ లేఖకు ఆర్బిఐ స్పందించింది.  రైతుల బ్యాంకు ఖాతాలు పరిశీలించామని ఆ లేఖలో దీపాలి పంత్‌ జోషి తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం 2013 ఖరీఫ్ దిగుబడులను పరిగణలోకి తీసుకున్నట్లు ఆర్బిఐ పేర్కొంది. గడచిన నాలుగేళ్ల సగటుతో పోలిస్తే దిగుబడులు ఎక్కువగానే ఉన్నాట్లు తెలిపింది. దీంతో రుణాల రీషెడ్యూల్పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలు  నమ్మి రైతులు, మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రుణాల రద్దు మాటను పక్కనపెట్టి, రీషెడ్యూల్ అని చంద్రబాబు చెప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ రీషెడ్యూల్ కూడా రద్దుపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో రైతులు ఏమీ తోచని స్థితిలో అయోమయంలో పడ్డారు.

మరిన్ని వార్తలు