-

చదువులకేదీ చేయూత?

7 Sep, 2014 23:46 IST|Sakshi
చదువులకేదీ చేయూత?

- కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కిమ్మనని సర్కారు
- పేరుకుపోతున్న రీయింబర్స్‌మెంట్ బకాయిలు
- స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలదీ అదే పరిస్థితి
- వేలాది మంది విద్యార్థులకు తప్పని అవస్థలు
సాక్షి, కాకినాడ : కొత్త ప్రభుత్వం కొలువుదీరి వందరోజులైనా విద్యార్థుల కొలిమి నుంచి బయటపడలేదు.  ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్, మెస్ చార్జీల బకాయిలు మంజూరు కాక వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా సొమ్ములందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.

రెండో కౌన్సెలింగ్ అనంతరం మరో వారం పదిరోజుల్లో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. అయినా గత విద్యాసంవత్సరానికి చెందిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాకు సంబంధించి ఈ మొత్తం రూ.122 కోట్ల వరకు ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు (ఉపకార వేతనాలు), మెస్ చార్జీల బకాయిలు కూడా కొండల్లా పేరుకుపోతున్నాయి. 2013-2014 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఎస్సీ, బీసీ, ఈబీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు సంబంధించి మొత్తం రూ.93,24,00,000 బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

3,400 మంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించి రూ.13 కోట్లు బకాయిలు ఉండగా, అందులో ఉపకారవేతనాల కింద రూ.10 కోట్లు, రూ.3 కోట్లు మెస్ చార్జీల నిమిత్తం విడుదల కావాల్సి ఉంది. 31వేల మంది బీసీ విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.35 కోట్లు, మెస్ చార్జీల కింద రూ.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 19 వేల మంది ఈబీసీ విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిమిత్తం చెల్లించాల్సి ఉంది. 3 వేల మంది ఎస్టీ విద్యార్థులకు సంబంధించి రూ.కోటి, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు రూ.24 లక్షలు విడుదల కావాల్సి ఉండగా మిగిలిన మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన బకాయిగా విడుదల కావలసి ఉంది.
 
‘దీవెన’కూ గతి లేదు..
ఇక రాజీవ్ విద్యాదీవెన పథకంకింద 9, 10 తరగతుల ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.150ల చొప్పున పది నెలలకు ఒకేసారి రూ.750 అడ్‌హాక్ గ్రాంట్ కింద మంజూరు చేస్తుంటారు. జిల్లాలో 12,945 మంది విద్యార్థులకు  మొత్తం రూ.2.91కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ న్యూస్కీమ్ కింద 5 నుంచి 8వతరగతి వరకు చదువుతున్న బాలురకు నెలకు రూ.100 చొప్పున, బాలికలకు రూ.150 చొప్పున చెల్లిస్తుంటారు. ఈ స్కీమ్ కింద జిల్లాలో 26,224 మంది విద్యార్థులకు రూ.3.28 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం రూ.71 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.2.57 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది.

ఉత్తమ గురుకుల పాఠశాలల్లో 652 మంది విదార్థులకు సంబంధించి రూ.1.30 కోట్లు విడుదల కావాల్సి ఉంది. నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు సంబంధించి రూ.20 లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంది. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకైతే రూ.50 కోట్ల వరకు స్కాలర్‌షిప్, మెస్‌చార్జీల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు పంపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అధికారులంటున్నారు.

మరిన్ని వార్తలు