టీటీడీ సంస్థలకు ఐఎస్‌ఓ గుర్తింపు

5 May, 2019 04:49 IST|Sakshi
టీటీడీ ఈవో, జేఈవోకు గుర్తింపు పత్రాలు అందజేస్తున్న ఐఎస్‌ఓ ప్రతినిధులు

తిరుపతి తుడా: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సంస్థలకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల,్డ కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్‌నగర్, బెంగళూరులోని టీటీడీ కల్యాణ మండపాలకు ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) గుర్తింపునిచ్చింది. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధ్యక్షతన శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, ఐఎస్‌ఓ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన సమీక్షలో ఐఎస్‌ఓ సంస్థ ప్రతినిధులు గుర్తింపునిస్తున్నట్లు ధ్రువీకరించారు.

ఈ మేరకు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం హర్షం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం జేఈవో మాట్లాడుతూ ఐఎస్‌ఓ ప్రతినిధులు పలుమార్లు టీటీడీ వసతి సముదాయాలు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలను పరిశీలించారన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లే వీటికి గుర్తింపు దక్కిందని వివరించారు. ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేసిన పలు విభాగాల అధికారులు, సిబ్బందికి ఐఎస్‌ఓ ప్రతినిధి కార్తికేయన్‌ ప్రశంసాపత్రాలు అందించారు. టీటీడీ చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈలు రమేష్‌రెడ్డి, రాములు, వేంకటేశ్వర్లు, డీఈవో రామచంద్ర, డెప్యూటీ ఈవోలు రామ్మూర్తిరెడ్డి, లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు