అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి

18 Dec, 2014 10:45 IST|Sakshi
అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్‌ఎల్వీ మార్క్‌- 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌ అయ్యింది. సరిగ్గా తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో శ్రీహరికోటలోని షార్‌ నుంచి.... జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది. కోట్లాది మంది ప్రజల ఆశలు మోసుకెళ్లిన రాకెట్‌....అంచెలంచెలు దాటుకుంటూ గమ్యస్తానాన్ని చేరింది. 20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేధించింది. వ్యోమగాముల గదిని  రాకెట్‌ 126 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది.

టార్గెట్‌ను చేరేవరకూ....శాస్త్రవేత్తలతో పాటు కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశింత స్థానాన్ని చేరడంతో .....షార్‌లో హర్షాతీరేకాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని అభినందనలు తెలుపుకున్నారు. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపించడమే లక్ష్యంగా ఇస్రో చేసిన ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపిన వ్యోమగాముల్ని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఇస్రో ప్రయోగించిన అతిబరువైన ఎక్స్‌పర్మెంట్‌ ఇదే. ప్రయోగ సక్సెస్‌తో శాస్త్రవేత్తలు మరో ఐదేళ్లలో అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు  సిద్ధమవుతున్నారు.

మానవులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసిందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు.  అంతరిక్ష ప్రయోగాల్లో ఇది గుర్తుంచుకోవాల్సిన రోజు అని ఆయన పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ అందరి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలోకి చేరుకుందని రాధాకృష్ణన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి రూ.155 కోట్లు వ్యయం అయినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు