వెన్నెల రాజు చెంతకు..!

10 Jul, 2019 07:07 IST|Sakshi

వడివడిగా చంద్రయాన్‌–2 పనులు

ప్రపంచం చూపు ఇస్రో వైపు

13న షార్‌కు ఇస్రో చైర్మన్‌

సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): చందమామ ఉపరితలంలో కలియదిరుగుతూ పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్‌–2 ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ అనుసంధానం కార్యక్రమాలు ముగిశాయి. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశానికి ఈ ప్రయోగం తలమానికం కావడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను నింగిలోకి పంపనుంది.

ఇందుకు సంబంధించి సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రంలో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ షార్‌లోని రెండో ప్రయోగవేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక బిల్డింగ్‌(వ్యాబ్‌) జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ అనుసంధానం పూర్తయింది. అక్కడి నుంచి రాకెట్‌ను ఉంబ్లికల్‌ టవర్‌కు అనుసంధానం చేసిన తరువాత పలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు చేయడంలో భాగంగా మంగళవారం ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌(ఎఫ్‌డీఆర్‌–1) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ ప్రయోగానికి సంబంధించిన పనులను పూర్తిచేయడంలో ఇస్రొ శాస్త్రవేత్తలు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 13వ తేదీ మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించిన అనంతరం ప్రయోగతేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. చంద్రుని మీద ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి. 2008లో భారత్‌ చంద్రయాన్‌–1 ద్వారా మొదటి ప్రయత్నంలో చంద్రుడి చుట్టూ ఉపగ్రహాన్ని పంపి పలు పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్‌–2 మిషన్‌లో భాగంగా ఈ సారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను దింపి అందులో ఉన్న రోవర్‌ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు. చంద్రుడి మీద పరిశోధనలు చేసే నాలుగో దేశంగా భారత్‌ ఆవిర్భవించనుంది. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ఈ నెల 13న రాత్రి షార్‌కు చేరుకోనున్నారు.

మరిన్ని వార్తలు