రాజధానిపై మక్కువేల?

5 Jan, 2015 02:58 IST|Sakshi
రాజధానిపై మక్కువేల?

* మదనపల్లె తాగునీటి సమస్యపై పోరాటం
* ఎంపీ మిథున్‌రెడ్డి

మదనపల్లె: ‘పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ప్రస్తు తం రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సింది పోయి రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రికి అంత మక్కువ ఎందుకు’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కుని వారికి జీవనాధారం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

ఆదివారం మదనపల్లెలోని వైఎస్సార్ సీపీ నాయకులు రైస్ మిల్ మాధవరెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని పేరుతో తెలుగుదేశం నాయకులు విలువైన భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను బలవంతంగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని పేర్కొన్నారు.

రాయలసీమ ప్రాంతంలో కరువు తీవ్రం గా ఉందని, పశువులకు గ్రాసం లేకపోవడం, వ్యవసాయానికి సాగునీరు లేకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగేందుకు నీరు కూడా లేవని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి కోట్లాది రూపాయలను రాజధాని పేరుతో ఖర్చు చేయడం తగదన్నారు. కేవలం రూ.750 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ-నీవా కాలువ ద్వారాకృష్ణా నదీ జలాలు రాయలసీమకు వచ్చే అవకాశముందన్నారు.

వీటి గురించి పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా మదనపల్లె మున్సిపాలిటీలో 15 రోజులకొకసారి తాగునీరు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు రోజులకొకసారి ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గుండ్లూరి షమీం అస్లాం, జిల్లా కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్, యువజన విభాగం కార్యదర్శి ఎస్‌ఏ కరీముల్లా, యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు బాబ్‌జాన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు