అసెంబ్లీలో జిల్లా సమస్యలపై వాడీవేడిగా..

24 Dec, 2014 03:03 IST|Sakshi
అసెంబ్లీలో జిల్లా సమస్యలపై వాడీవేడిగా..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదురోజుల పాటు నిర్వహించిన శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ముఖ్యంగా జిల్లా సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా వాణి వినిపించారు. సాగు, తాగునీరు, బీసీ విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలతో పాటు నెల్లూరు నగరంలోని డ్రైనేజీకి రూ.1,500 కోట్లు, టైరుబండ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వాలని అసెంబ్లీలో గర్జించారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు ప్రజల దాహార్తి తీర్చే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
 
 ఇంకా విశ్రాంత ఉద్యోగులకు ఇళ్లస్థలాలపై అసెంబ్లీలో లేవనెత్తారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సంగం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీటిమట్టాన్ని పెంచి కనువూరు కాలువకు నీరందించాలని డిమాండ్ చేశారు. కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై మాట్లాడారు. కావలి కాలువ బాగుచేయకపోవటంతో రైతులు మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం నీరివ్వలేకపోతే రైతులకు నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
 గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తాగునీటి కోసం విడుదల చేసిన నిధులను కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. గూడురు పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు ఇచ్చేందుకు గతంలో వైఎస్సార్ మంజూరు చేసిన రూ.64.13 కోట్లు నిధులు దుర్వినియోగంపై చర్చించారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి చక్కెర ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు. మొత్తంగా శీతాకాల సమావేశాల్లో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
 
 ఏకపక్షంగా వ్యవహరించారు
 అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సమస్యలపై ప్రస్తావిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం పనిగట్టుకుని వైఎస్‌ఆర్‌ని, జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌చేసి ప్రజాసమస్యలను గాలికొదిలేశారు. ఐదురోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే అధికారపార్టీ నేతలకు ప్రజల సమస్యలపై అవగాహనలేదని తేలిపోయింది.
 - మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే
 
 ప్రజల గుండెచప్పుడు వినిపించాం...
 టీడీపీ నేతలు సభా సంప్రదాయాలను అడుగడుగునా ఉల్లంఘించారు. ఏదోలా అసెంబ్లీ సమావేశాలు నడపాలనే ఉద్దేశంతో మొక్కుబడిగా నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల గొంతునొక్కేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. మాకు ఎక్కడ అవకాశం ఇస్తే వారి వైఫల్యాలు బయటపడతాయోననే భయంతో ప్రవర్తించారు. అయినా మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల గుండెచప్పుడు వినిపించారు.
 - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
 
 గొంతునొక్కడమే పరమావధిగా...
 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల గొంతనొక్కడమే పరమావధిగా అసెంబ్లీ సమావేశాలు సా గాయి. సమస్యలపై ప్రస్తావిస్తే వాటి గురించి మాట్లాడకుండా దివంగత సీఎం వైఎస్‌ఆర్‌పై నిందలు వేయటానికే మం త్రులు, ఎమ్మెల్యేలు సమయం తీసుకున్నారు. జనం సమస్యల గురించి చర్చించటానికి సాహసించలేకపోయారు.
 - అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
 
 ప్రధాన సమస్యలు చర్చించటానికి సమయం ఇవ్వలేదు
 రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, సామాజిక భద్రతా పింఛన్లు, కమిటీల పేరుతో టీడీపీ నేతల అక్రమాలు, ఇసుక అక్రమరవాణా వంటి సమస్యల గురించి ప్రస్తావించాల్సి ఉంది. అయినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించటానికి వీల్లేకుండా చేశారు. మొక్కుబడిగా నిర్వహించారే తప్పా  సమస్యల వాటి పరష్కారానికి మార్గాల అన్వేషించే తీరిక వారికి లేనట్టుంది.
 - కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే
 
 ఆత్మస్తుతి.. పరనింద...
 ఐదురోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఆత్మస్తుతి.. పరనిందలా సాగింది. రుణమాఫీ గురించి మా నాయకుడు మాట్లాడితే.. వారు కాకిలెక్కలు చెబుతున్నారు. వారి గురించి వారు పొగుడుకునేందుకు తప్ప సమస్యల గురించి ప్రస్తావించే ఓపిక.. తీరిక వారికి లేనట్టుంది. మా నియోజక వర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలని ప్రతిరోజూ అడుగుతూనే వచ్చాను. అయినా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.
 - కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే
 
 మోసాలను దాచే ప్రయత్నం చేశారు
 చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని అమలుచేయమంటే.. మా గొంతునొక్కే ప్రయత్నం చేశారు. వారు చేసిన మోసాల్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికీ నిందలు వేయటానికే అసెంబ్లీ సమయాన్ని వాడుకున్నారే తప్ప.. సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోలేదు.  నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశా.
 - రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి,కావలి ఎమ్మెల్యే
 
 వారి కోసమే అసెంబ్లీ పెట్టుకున్నారు...
 ప్రజా సమస్యల గురించి చర్చించటానికి అసెంబ్లీ పెట్టుకున్నట్లు లేదు. కేవలం టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకునేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లుంది. ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడితే.. రూల్స్ తెలియవంటారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు అనుభం లేదంటారు. ఇక్కడ కావాల్సింది అనుభవం కాదు.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అవసరం. ఏది మాట్లాడినా.. వైఎస్‌ఆర్ గురించి మాట్లాడుతారు. ప్రజా సమస్యలను చర్చించే పరిస్థితుల్లో ప్రస్తుత అసెంబ్లీ లేదని తేలిపోయింది.
 - పాశం సునీల్‌కుమార్, గూడూరు ఎమ్మెల్యే
 
 ప్రతిపార్టీకి మాట్లాడే అవకాశం ఇచ్చాం
 అసెంబ్లీలో ప్రతి పార్టీకి మాట్లాడే అవకాశం ఇచ్చాం. రుణమాఫీ చేశాం. రైతులు ఈసారి సంతోషంగా సంక్రాంతి జరుపుకోనున్నారు. రాష్ట్రంలో పేదలు ఉండకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గారి ఉద్దేశం. ఆ దిశగా మా నాయకుడు పనిచేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతిపక్ష నేతలు సహకరించటం లేదు.
 - కురుగొండ్ల రామకృష్ణ, వెంకటగిరి ఎమ్మెల్యే
 

మరిన్ని వార్తలు