హాస్టల్ సమస్యలపై విద్యార్థుల ఆందోళన

30 Nov, 2013 03:46 IST|Sakshi

పాలమూరు యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఇక్కడి పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ముందుగా వారు కళాశాల భవనానికి తాళం వేసి అనంతరం అక్కడి నుంచి పరిపాలనా విభా గ భవనం వద్దకు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

 బీ-ఫార్మసీ విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని నాలుగు నెలల క్రితం అధికారులు చెప్పినా ప్రయోజనం దక్కలేదన్నారు. పీయూకు యూజీసీ 12(బి) లేకపోవడం వల్ల ఏటా తక్కువ నిధులు విడుదల చేస్తున్నందున అభివృద్ధి కుంటుపడిందన్నారు.


ల్యాబ్‌లు లేకపోవడంతో పరిశోధనలకు ఇబ్బందిగా ఉందన్నారు. పీయూ రిజిస్ట్రార్ వెంకటాచలం కళాశాలతోపాటు హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో విద్యార్థులు సందీప్, పవన్‌కుమార్, రవి, సురేశ్, వెంకటేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు