ఎంతకీ...కొలిక్కిరాదే!

10 Mar, 2019 10:57 IST|Sakshi

ఆ తొమ్మిదింటిపై సందిగ్ధం

అభ్యర్థుల కోసం  టీడీపీ అన్వేషణ

కొన్నిచోట్ల తెరపైకి కొత్త ముఖాలు

అమరావతిలోనే  తమ్ముళ్లు 

సాక్షి, తిరుపతి : జిల్లాలో టీడీపీ టికెట్ల పంచాయితీ సాగుతూనే ఉంది. చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లి, పూతలపట్టు, నగరి, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చెయ్యలేదు. చిత్తూరు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, సత్యవేడులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. అక్కడ వారి పరిస్థితి బాగా లేకపోవడంతో వేరొకరిని బరిలో దింపాలనేది చంద్రబాబు ఆలోచన. సిట్టింగ్‌లు కాకుండా మరి కొందరు టికెట్‌ ఆశిస్తున్న వారిపై చంద్రబాబు సర్వే నిర్వహించారు.

ఆ సర్వేలోనూ వారికీ అనుకూలంగా లేకపోవడంతో స్థానిక నాయకులను కొందరిని అమరావతికి పిలిపించుకున్నారు. జనంలో వ్యతిరేక ఉందని సర్వేలు చెబుతున్నది వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు అభిప్రాయాలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా రోజూ ఒక్కో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలను రకరకాల ప్రశ్నలు వేస్తూ గెలుపోటములపై అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పొమ్మనలేకుండా పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

శ్రీకాళహస్తి విషయంలో మాత్రం బొజ్జల కుటుంబానికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు ఖరారు చెయ్యకపోయినా.. ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పినట్లు తెలిసింది. మిగిలిన వారికి మరోసారి అవకాశం లేదని అమరావతిలో తిష్టవేసి ఉన్న టీడీపీ శ్రేణులు తేల్చిచెబుతున్నాయి.


కొత్త వారి కోసం అన్వేషణ
జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానాలకు కొత్త వారి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం టికెట్‌ ఆశిస్తున్న వారికి సర్వేలో అనుకూలంగా లేకపోవడంతో వేరొకరికి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పూతలపట్టు అసెంబ్లీకి లలితకుమారి ఈసారి లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారని, మరోసారి టికెట్‌ ఇచ్చి సాహసం చెయ్యలేని తేల్చిచెప్పినట్లు 

ఆమె అనుచరులు చెబుతున్నారు. దీంతో నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన సునీల పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈమె గతంలో కాంగ్రెస్‌లో ఉంటూ మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి సన్నిహితురాలిగా ఉన్నట్లు తెలిసింది. పూతలపట్టు నుంచి ఈమె పేరును కొందరు ప్రతిపాదించడంతో సునీలను అమరావతికి పిలిపించినట్లు తెలిసింది. ఆమె శుక్ర, శనివారాల్లో సీఎం చంద్రబాబును కలిశారు. అదేవిధంగా మదనపల్లె నుంచి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, రాందాస్‌చౌదరికి సర్వేలు అనుకూలంగా లేవని తేలడంతో బీసీ మహిళకు ఇవ్వాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా బోడిపాటి మమత పేరు తెరపైకి వచ్చినట్లు తెలిసింది.


నగరి నేతలు వారం రోజులుగా అక్కడే..
నగరి విషయానికి వస్తే గాలి సోదరులు ఇద్దరు తనకు టికెట్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు అశోక్‌రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారం రోజులుగా అమరావతిలోనే ఉన్నా ఎవరివైపు చంద్రబాబు మొగ్గుచూపకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ముగ్గురిని కాకుండా కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తంబళ్లపల్లె విషయానికి వస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక్కడి నుంచి వేరొకరిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. గంగాధరనెల్లూరు విషయానికి వస్తే గుమ్మడి కుతూహలమ్మ కుమారుడి పేరు దాదాపు ఖరారు చేశారని చెబుతున్నా నియోజక వర్గంలో పరిస్థితి బాగోలేకపోవడంతో సందిగ్ధంలో పడినట్లు తెలిసింది. ప్రస్తుతం టికెట్‌ ఆశిస్తున్న వారి పరిస్థితి బాగోలేకపోవడం.. కొత్త వారు దొరక్కపోవడంతో చంద్రబాబు ఈ రోజు రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
   

>
మరిన్ని వార్తలు