అన్య మతస్తులకు పదవులివ్వడం ధర్మ విరుద్ధం

24 Apr, 2018 12:27 IST|Sakshi
మాట్లాడుతున్న రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌ 

రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌

విజయనగరం టౌన్‌: తిరుమల తిరుపతి దేవస్థానం పదవులను అన్యమతస్తులకు ఇవ్వడం హిందూ ధర్మ విరుద్ధమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కె.పి.ఈశ్వర్‌ అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హిందువులు కానివారిని తక్షణమే ఆయా పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సనాతన హిందూ ధర్మానికి, భారతీయ సంప్రదాయానికి కేంద్రమైన టీటీడీ దేవస్థానంలో ట్రస్టు బోర్డు పదవులు అన్యమతస్తులకు కట్టబెట్టడం తీవ్ర అపచారమన్నారు.

వేంకటేశ్వరస్వామివారికి  విరుద్ధంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమైన ఘటనలను సీఎం చంద్రబాబునాయుడు గుర్తుచేసుకోవాలన్నారు. తప్పిదాన్ని తక్షణమే సరిదిద్దుకోకుంటే  రానున్న ఎన్నికల్లో  ఓటమి చవిచూడక తప్పదని జోస్యం చెప్పారు.

 ట్రస్టు బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే అనిత స్వయంగా తను క్రిస్టియన్‌ అని చెప్పినప్పటికీ  ఆమెను ట్రస్టుబోర్డు సభ్యురాలిగా నియమించిన చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దార్లపూడి సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు గుర్రాజు, జిల్లా శాఖ ప్రతినిధులు కె.వి.రమణమూర్తి,  ఆర్‌.వెంకటరావు,  ఎ.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు