సీమాంధ్ర అభివృద్ధికి నావంతు కృషి

3 Jun, 2014 00:49 IST|Sakshi
సీమాంధ్ర అభివృద్ధికి నావంతు కృషి

ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ డీజీపీ జేవీ రాముడు

 హైదరాబాద్: అవశేష ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా నియమితులైన జాస్తివెంకట రాముడు ఉద్ఘాటించారు. సీమాంధ్ర డీజీపీకి కేటాయించిన హైదరాబాద్‌లోని సీఐడీ భవనంలో సోమవారం ఆయన తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్త రాష్ట్రం అభివృద్ధికి అన్ని స్థాయిల్లోనూ ప్రతి ఒక్కరూ కష్టపడాలి. డీజీపీగా నా వంతు కృషి చేస్తా. ఏ పోస్టులో ఉన్నా నిత్యం నా ఉద్యోగానికి పూర్తి న్యాయం చేయాలని భావిస్తా. ఇప్పుడూ అదే పంథా అనుసరిస్తా. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటా. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలి. అప్పుడే ఇరు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం మీడియా పాత్ర కీలకమైంది.

వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పనిచేస్తాం’ అని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు నియమితులయ్యారు. ఈయన కూడా సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాముడు, ప్రసాదరావులకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు