తిరుధామం.. పారిశ్రామిక తోరణం

25 Dec, 2015 02:09 IST|Sakshi
తిరుధామం.. పారిశ్రామిక తోరణం

ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి
శ్రీకాళహస్తి-ఏర్పేడు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భూముల సేకరణ
స్థలం కావాలని ఏపీఐఐసీకి వినతులు
తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమి  సేకరించేందుకు కసరత్తు

 
తిరుపతి:  తిరునగరిలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రం వీడిపోయాక తిరుపతి పరిశ్రమల కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో వందలాది పరిశ్రమలు నెలకొల్పారు. తిరుపతి సమీపంలోని విమానాశ్రయం వద్ద రూ.1,070కోట్ల పెట్టుబడితో శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీ హబ్ ఏర్పడింది. విద్యా సంస్థలు ఐఐటీ, ఐజర్‌కు శంకుస్థాన చేశారు. చెన్నె, బెంగళూరు నగరాలకు తిరుపతి అందుబాటులో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉండటం కలిసొచ్చే అంశం.
 
1,720 ఎకరాలు సిద్ధం
 ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలో 1,720 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. పీలేరు సమీపంలో 600 ఎకరాలు, కలికిరి సమీపంలోని తాటిగుంటపల్లెలో 1000, గంగవరం మండలం గండ్రరాజులపల్లెలో 120 ఎకరాలు ఉన్నాయి. ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు తిరుపతి సమీపంలోనే భూములు కావాలని దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని సేకరించడానికి ఏపీఐఐసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జిల్లాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించారు.
 
శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో..

 తిరుపతి చుట్టుపక్కల భూములు లేకపోవడంతో శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాల వైపు పారిశ్రామికవేత్తలు దృష్టి సారించినట్లు సమచారం. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
 ఇక్కడ ఇబ్బంది తలెత్తితే కాళంగి రిజర్వార్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం     చేశారు. ఇటీవలే సర్వే కూడా పూర్తి అయినట్లు సమాచారం.
 
ఐటీ కంపెనీలు..
ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు తిరుపతిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుపతి సమీపంలోని విమానాశ్రయ సమీపంలో, ఏర్పేడు ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించినట్లు తెలుస్తోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ రూ.1,500 కోట్లతో తిరుపతిలో క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు, ఇందులో భాగంగానే కంపెనీ ప్రతినిధులు అనువైన ప్రదేశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తిరుపతి నగరంలో పరిశ్రమలు స్థాపించేందుకు కంపెనీ యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుతం ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి.
 
 

మరిన్ని వార్తలు