సీఎం రమేష్‌ సంస్థల్లో ఐటీ సోదాలు

13 Oct, 2018 04:53 IST|Sakshi

హైదరాబాద్, ప్రొద్దుటూరు, పోట్లదుర్తిలోని నివాసాల్లో తనిఖీలు

టీడీపీ ఎంపీ సోదరులు, బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

సీఎం రమేష్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో భారీ వ్యత్యాసాలు

పొంతన లేని ఐటీ రిటర్నులు..

భారీగా జరిగిన నగదు లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టిన అధికారులు

గొలుసుకట్టు కంపెనీల ద్వారా అక్రమంగా పెద్ద ఎత్తున తరలించినట్లు అనుమానాలు

లావాదేవీలపై బ్యాంకు అధికారులను ప్రశ్నించిన ఐటీ అధికారులు

టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 145 శాతం పెరిగిన ‘రిత్విక్‌’ వ్యాపారం

సాక్షి, అమరావతి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్‌ (సీఎం రమేష్‌)కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలో సుమారు 90 నుంచి 100 మంది ఐటీ అధికారులు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్, వైఎస్సార్‌ జిల్లా పోట్లదుర్తిలో ఉన్న ఇళ్లతో పాటు రిత్విక్‌ ప్రాపర్టీస్, అనుబంధ కంపెనీల్లో సోదాలు జరిపారు. ఇంజనీరింగ్‌ కాంట్రాక్టులు, మైనింగ్‌ విద్యుత్తు తదితర రంగాల్లో ఉన్న సీఎం రమేష్‌ వ్యాపార సామ్రాజ్యం గత మూడేళ్లలో అనూహ్యంగా పెరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు పెరగకపోవడం, ఖాతాల నుంచి నగదు రూపంలో లావాదేవీలు భారీగా జరుగుతుండటం ఐటీ సోదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో రాత్రిదాకా సోదాలు... విచారించేందుకు సిద్ధమవుతున్న అధికారులు!
హైదరాబాద్‌ సాగర్‌ సొసైటీలోని రమేష్‌ కన్‌స్ట్రక్షన్, విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్వహించే రిత్విక్‌ కంపెనీ, జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో 16 మంది అధికారులతో కూడిన బృందం సోదాలు జరిపింది. 2014కి ముందు ఆయన దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ఆ తర్వాత దాఖలు చేస్తూ వస్తున్న వివరాల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు ఈ సందర్భంగా గుర్తించారని తెలిసింది. సీఎం రమేష్‌ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్‌ అయిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు.

నాలుగేళ్లలో రూ.వందల కోట్ల మేర ఆస్తులు పెరిగిపోవడం, వాటికి సంబంధించి చెల్లించాల్సిన ఐటీలో తేడా ఉండటంపై అధికారులు సీఎం రమేశ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రమేశ్‌ కంపెనీలకు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రాజెక్టుల టెండర్లు, వాటి ద్వారా వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కల్లోనూ భారీగా తేడాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని లావాదేవీలు, నిర్మాణ రంగం, పవర్‌ ప్రాజెక్టులు దక్కించుకున్న అంశాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్‌ సంస్థ నుంచి 8 హార్డ్‌డిస్క్‌లు, 18 పెన్‌డ్రైవ్‌లు, 6 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

3 సూటుకేసుల్లో కీలక పత్రాలు
వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ ఇంటికి ఉదయమే చేరుకున్న తిరుపతి ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఎంపీ ఢిల్లీలో ఉండడంతో ఆయన సోదరుడు సురేష్‌నాయుడి సమక్షంలో సోదాలకు ఉపక్రమించారు. ఎంపీ సోదరులు సురేష్, రాజేష్, ప్రకాష్‌ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ప్రొద్దుటూరులో ఉంటున్న రమేష్‌ సమీప బంధువు గోవర్ధన్‌నాయుడు ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటి జాబితాను సురేష్‌నాయుడుకు అందచేసి మూడు సూట్‌కేసులతో సాయంత్రం 5.30 గంటలకు వెనుతిరిగారు. 

అత్యధిక చెల్లింపులు నగదు రూపంలోనే
2013–14లో రూ.55,349.26 కోట్లుగా ఉన్న రిత్విక్‌ ప్రాపర్టీస్‌ ఆదాయం రెండేళ్లలో అంటే 2016–17 నాటికి ఏకంగా 145 శాతం పెరిగి రూ.1,35,720.78 కోట్లకు చేరుకుంది. మరోవైపు 2017–18కి సంబంధించి ఐటీ రిటర్నులు ఇంకా సమర్పించలేదని రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) సమాచారం ద్వారా వెల్లడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కించుకున్న రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి చెల్లింపులు జరగగానే అధిక భాగం నగదు రూపంలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై హైదరాబాద్‌ సాగర్‌ సొసైటీలోని అలహాబాద్‌ బ్యాంక్‌ అధికారులను ఆరా తీసిన ఐటీ అధికారులు బ్యాంకు మేనేజర్‌ నుంచి సాక్షి సంతకాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఐటీ అధికారులు తనిఖీలకు దిగినట్లు భావిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పలు లావాదేవీలకు సంబంధించిన విలువైన పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను ఐటీ అధికారులు సీజ్‌ చేసి సూట్‌కేసుల్లో తరలించారు.

పుట్టగొడుగుల్లా కంపెనీలు... 
సీఎం రమేష్, ఆయన సోదరుడి పేరు మీద 10కి పైగా ప్రధాన కంపెనీలతో పాటు పలు డొల్ల కంపెనీలు ఉన్నట్లు తేలింది. వీటిలో కొన్ని కంపెనీలు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రారంభం కావడం గమనార్హం. రిత్విక్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గ్లోబల్‌ ఎర్త్‌ మినరల్స్, ల్యాండ్‌ మార్క్‌ ఇన్‌ఫ్రా ఎస్టేట్స్‌ అండ్‌ హోమ్స్,  రిత్విక్‌ హోల్డింగ్స్, అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్‌ ఎనర్జీ, కదిరి గ్రీన్‌ పవర్, రిత్విక్‌ గ్రీన్‌ పవర్‌లతోపాటు మరికొన్ని డొల్ల కంపెనీలు ఉన్నట్లు బయటపడింది. వీటిలో కడప, అంజనాద్రి, నారాయణాద్రి, కదిరి గ్రీన్‌ పవర్‌ కంపెనీలు రెండు మూడేళ్ల క్రితమే ఏర్పాటయ్యాయి. 

షెల్‌ కంపెనీల్లోకి నిధుల మళ్లింపు?
రిత్విక్‌ ప్రాజెక్టస్‌ ద్వారా వచ్చిన నిధులను సీఎం రమేష్‌ గొలుసుకట్టు కంపెనీలలోకి మళ్లించడం ద్వారా భారీ మొత్తాలను బయటకు తరలించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా దృష్టి సారించి దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆంతరంగికుల్లో ఒకరైన సీఎం రమేష్‌ ఆదాయం అనూహ్యంగా పెరగడంపై వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 2009లోనే కోర్టు తలుపులు తట్టారు. 2003లో రూ.61 కోట్లుగా ఉన్న రమేష్‌ కంపెనీ ఆదాయం 2009 నాటికి రూ.488 కోట్లకు పెరిగిందని, ఓ చిన్న సబ్‌కాంట్రాక్టరుకు ఈ స్థాయిలో వ్యాపారం పెరగడం అసాధారణమని, దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టును ఆమె గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సోదాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నిరసన....
సీఎం రమేష్‌ ఇంట్లో ఐటీ సోదాలపై టీడీపీ శ్రేణులు పోట్లదుర్తిలో నిరసన తెలిపాయి. శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.  

సోదాల వెనుక కేంద్రం ప్రమేయం: సీఎం రమేష్‌
సాక్షి, న్యూఢిల్లీ: తన ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ సోదాల  వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున తనపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తున్నారని శుక్రవారం ఢిల్లీలోని మీడియాతో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయాన్ని చూసి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన సంస్థల ద్వారా వస్తున్న ఆదాయానికి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు తెలంగాణ ప్రభుత్వ అధికారులను మధ్యవర్తులుగా తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా