సవరణతో సమర్పయామి!

5 May, 2018 04:40 IST|Sakshi

     విశాఖలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు భారీగా లబ్ధి

     పది ఎకరాలకు మించి కేటాయించొద్దన్న సీఎస్‌ సూచనలు గాలికి

     మార్కెట్‌ ధర ఎకరం రూ.10.16 కోట్లు ఉంది.. కనీసం ఏపీఐఐసీ ధర రూ.2.70 కోట్లకైనా ఇవ్వండన్న సీఎస్‌

     ఈ సూచనలను బేఖాతరు చేస్తూ ఎకరం రూ.32.50 లక్షలకు తొలుత కేటాయింపు

     ఇప్పుడేమో 25ఎకరాలు త్వరగా ఆ సంస్థకు అమ్మేయండంటూ మరో జీవో

     మిగతా 15 ఎకరాలూ అదే సంస్థకు ఏడేళ్లపాటు రిజర్వ్‌ చేయాలని ఆదేశాలు

     రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేయాలన్న నిబంధన ఏడేళ్లకు పొడిగింపు

     ఏపీఐఐసీకి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: ఆర్థిక నగరమైన విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన భూములను ఐటీ కంపెనీల పేరుతో కారు చౌకగా కేటాయించడంపై సచివాలయంలోని ఉన్నతస్థాయి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భూముల కేటాయింపులు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సిఫార్సులను, సూచనలను ఉల్లంఘిస్తూ ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు భారీ లబ్ది చేకూర్చడంతో ఆ వర్గాలు విస్తుపోతున్నాయి. భూములను తక్కువ ధరకు కేటాయిస్తూ గతంలో జారీచేసిన జీవోకు ఇప్పుడు మళ్లీ సవరణలు చేస్తూ ఆ సంస్థకు మరింతగా ప్రయోజనం కల్పిస్తూ మరో జీవో జారీచేయడంపై ఆ వర్గాల్లో పెద్దఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

గతంలో జారీచేసిన జీవోలో 25 ఎకరాలను అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సంస్థకు ఎకరం రూ.32.50 లక్షల చొప్పున కేటాయించాలని పేర్కొన్నారు. అలాగే, ప్రాజెక్టును రెండేళ్లలో అమలుచేయాలని స్పష్టంచేశారు. అయితే, ఇప్పుడు ఆ జీవోను సవరించి ముందుగా 25 ఎకరాలను వీలైనంత త్వరగా ఆ సంస్థకు రాసిచ్చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రాజెక్టు పూర్తి గడువును రెండేళ్ల నుంచి ఏకంగా ఏడేళ్లకు పెంచేశారు. గతంలో సీఎస్‌ ఆదేశాలను దిక్కరించి ఆ సంస్థకు లబ్ది చూకూర్చిన ఐటీ శాఖ తీరుపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్టుకు కేటాయించిన భూమిపై ఆ సంస్థలకు పూర్తిస్థాయి హక్కులను కల్పించరు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ సేల్‌డీడ్‌ను కూడా ప్రభుత్వం ఇవ్వదు. కానీ, ఇప్పుడు సవరించిన జీవోలో ఆ భూమిని విక్రయించేయాలని పేర్కొనడం గమనార్హం. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్‌ జారీచేసిన ఈ సవరణ జీవోలో వీలైనంత త్వరగా తొలి దశలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సంస్థకు 25 ఎకరాలను రాసిచ్చేయాలని ఏపీఐఐసీని ఆదేశించారు. మిగతా 15 ఎకరాలను కూడా ఆ సంస్థ కోసం ఏడేళ్ల పాటు రిజర్వ్‌ చేసి ఉంచాలని, ఏడేళ్లలోగా ఆ సంస్థ కొనుగోలుకు ముందుకు వస్తే రాసిచ్చేయాలని పేర్కొన్నారు. 

పదెకరాలు సరిపోతుందన్న ఎస్‌ఐపీసీ
పెట్టుబడులను ఆకర్షించే పేరుతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం అమెరికాలో పర్యటించిన సందర్భంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో పెట్టుబడి పెడితే సముద్ర తీర ప్రాంతంలో 100 ఎకరాల భూమి కేటాయిస్తామని ఆ సంస్థకు హామీ ఇచ్చింది. ఆ క్రమంలోనే విశాఖ జిల్లా రుషికొండ, మధురవాడల్లో సర్వే నెంబర్‌ 409లో ఏపీఐఐసీకి చెందిన 40 ఎకరాల భూమిని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సంస్థతో పాటు ఇన్నోవా సొల్యూషన్స్‌కు ఎకరం రూ.32.50 లక్షల చొప్పున తొలుత కేటాయించారు. ఇందులో 25 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు, మిగతా 15 ఎకరాలను ఇన్నోవా సొల్యూషన్స్‌కు కేటాయించారు. ఈ దశలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎస్‌ఐపీసీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కోలో కేవలం పది ఎకరాల్లోనే ఉందని, ఆ మేరకు రాష్ట్రంలో కూడా పది ఎకరాలను కేటాయిస్తే సరిపోతుందని, కంపెనీ పనితీరు ఆధారంగా తరువాత కేటాయించవచ్చునని ఎస్‌ఐపీసీ స్పష్టంచేసింది. అంతేకాకుండా, ఈ కంపెనీలకు కేటాయించే భూమి మార్కెట్‌ ధర ఎకరం రూ.10.16 కోట్లు ఉందని, ఏపీఐఐసీ ధర ఎకరం రూ.2.70 కోట్ల రూపాయలున్నందున కనీసం ఏపీఐఐసీ ధరకైనా భూములను కేటాయించాలని ఎస్‌ఐపీసీ సూచించింది. అయితే, ఈ వీటన్నింటినీ తుంగలో తొక్కి ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు 25 ఎకరాలను, ఇన్నోవా సొల్యూషన్స్‌కు పది ఎకరాలను ఎకరం రూ.32.50 లక్షల చొప్పున కేటాయిస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్‌ జీవో జారీచేశారు. రెండేళ్లలో కంపెనీ ఏర్పాటును పూర్తిచేయాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ భూములను కేటాయించడం ద్వారా ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ 2,500 హైఎండ్‌ ఐటీ ఉద్యోగాలను కల్పిస్తుందని అందులో తెలిపారు. కేటాయించిన భూమిలో 30 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చునని వెసులుబాటు కూడా కల్పించారు.

సవరణ జీవోతో వెంటనే 25ఎకరాలు కేటాయింపు
అయితే, ఇప్పుడు గతంలో జారీచేసిన జీవోను సవరిస్తూ కొత్తగా మరో జీవోను ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్‌ జారీచేశారు. సవరణ జీవోలో తొలి దశలో భాగంగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు 25 ఎకరాలను వీలైనంత త్వరగా రాసిచ్చేయాలని ఏపీఐఐసీని ఆదేశించారు. అలాగే, మిగతా 15 ఎకరాలను కూడా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు ఏడేళ్ల పాటు రిజర్వ్‌ చేసి ఉంచాల్సిందిగా సవరణ జీవోలో ఏపీఐఐసీని ఆదేశించారు. కాగా, రెండేళ్లలో ఐటీ యూనిట్లను ఏర్పాటుచేయాలనే నిబంధనను తొలి జీవోలో విధించగా.. సవరించిన జీవోలో ఏడేళ్లకు పొడిగించారు. అలాగే, మిగతా 15 ఎకరాలను ఏడేళ్లలోగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తీసుకోకపోతే ఏడేళ్ల అనంతరం ఇతర ఐటీ కంపెనీలకు కేటాయించాలని పేర్కొన్నారు. అయితే, సవరణ జీవోలో ఇన్నోవా సొల్యూషన్స్‌ను తప్పించి మొత్తం 40 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కే  ఇవ్వడం గమనార్హం. రూ.400 కోట్ల విలువైన భూమిని రూ.13 కోట్లకే ఆ సంస్థకు కేటాయించం వెనుక దాగిన సత్యమేమిటన్నది బహిరంగ రహస్యమే.

మరిన్ని వార్తలు