రూ. 150 కోట్లు ముట్టిన ఆంధ్రా ప్రముఖుడెవరు?

13 Nov, 2019 01:58 IST|Sakshi

సీబీడీటీ ప్రకటనతో చర్చనీయాంశమైన వ్యవహారం

ఈ ఏడాది ఫిబ్రవరి– ఏప్రిల్‌ మధ్య పలువురు టీడీపీ నేతలపై ఐటీ దాడులు

సుజనాకు చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

మాజీ మంత్రి నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్, అప్పటి పోలవరం కాంట్రాక్టర్‌ నవయుగపై ఐటీ దాడులు

ఓ పత్రికాధిపతి బంధువు కంపెనీకి రూ. 5 వేల కోట్ల పోలవరం కాంట్రాక్టు అప్పగించడంలోనూ అక్రమ లావాదేవీలు

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద రూ.750 కోట్లు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం...

ఐటీ దాడుల్లో వెలుగు చూసిన అంశాలెన్నో

అన్ని అంశాలు క్రోడీకరించి కొద్దిరోజుల్లోనే మొత్తం వ్యవహారం బయట పెడతామంటున్న ఐటీ అత్యున్నతస్థాయి వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో కాంట్రాక్టులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ బయటపెట్టిన కుంభకోణం ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు పారిశ్రామికవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోగస్‌ బిల్లులు పెట్టి భారీగా డబ్బు తీసుకున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖుడొకరికి రూ. 150 కోట్లు ముట్టజెప్పారంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించడం సంచలనంగా మారింది. ప్రముఖుడంటూ చేసిన ప్రకటనలోని వ్యక్తి ఎవరా అనేది ఉభయ రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. బోగస్‌ బిల్లులు, హవాలా లావాదేవీలతో సంబంధం ఉన్న సదరు ప్రముఖ వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో (2014–2019) కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆ కీలక వ్యక్తికి రూ. 150 కోట్లు చేరినట్లు ఆధారాలు ఉన్నాయని ఆదాయపన్నుశాఖ అత్యున్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. హవాలా వ్యాపారులకు, సదరు కీలక వ్యక్తికి ఉన్న సంబం ధాలు కూడా తమ దాడుల సందర్భంగా వెల్లడయ్యాయని ఆ అధికారి చెప్పారు. ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టుల పనుల పేరుతో బోగస్‌ బిల్లులు పెట్టి భారీగా డబ్బు దోచేసిన వారి వివరాలను వీలైనంత త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్య జరిగిన దాడులే కీలకం...
షెల్‌ కంపెనీలు సృష్టించడం, బోగస్‌ బిల్లులతో నిధులు కాజేయడం వంటివి బయటకు రావడానికి ముందు ఆదాయపన్నుశాఖ పెద్ద కసరత్తే చేసింది. అనుమానం ఉన్న వారందరిపైనా దాడులు చేస్తూ వచ్చింది. అవన్నీ 2018 జూన్‌–డిసెంబర్, 2019 ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్య జరిగినవే. ఐటీశాఖ దాడులు ఎదుర్కొన్న వారంతా అప్పటి ప్రభుత్వంలో భాగస్వాములు లేదా సన్నిహితులైన వారే కావడం గమనార్హం. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్‌ కంపెనీలు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌కు సంబంధించిన అకౌంటెంట్‌తోపాటు అప్పటి పోలవరం కాంట్రాక్టు సంస్థ సహా అనేక కంపెనీలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆ దాడుల్లో బహిర్గతమైన సమాచారం ఆధారంగానే నవంబర్‌ మొదటి వారంలోనూ ఏపీ, తెలంగాణలో మరికొన్ని సోదాలు జరిగాయి. షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లు ఎగవేసిన ఆరోపణల కేసులో సుజనా చౌదరికి చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. నకిలీ ఆస్తులు, బోగస్‌ ఇన్వాయిస్‌లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకొని ఆ మొత్తాన్ని షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్లు ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో హవాలా వ్యాపారుల పాత్రను గుర్తించింది. ఆ క్రమంలోనే నవంబర్‌ మొదటి వారంలో ఏపీ, తెలంగాణలో ఆదాయపన్నుశాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది. హవాలా ద్వారా ఏపీలో ప్రముఖ వ్యక్తికి రూ. 150 కోట్లు చేరవేసిన వ్యవహారాన్ని ఈ దాడుల్లో పసిగట్టింది. ‘ఆదాయపన్నుశాఖ దాడుల ఫలితంగా తమ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఆదాయపన్నుశాఖ దాడుల సమయంలో పోలీసు భద్రత ఇవ్వబోమని ప్రకటించింది’అని ఢిల్లీలో ఈడీ అధికారి ఒకరు గుర్తుచేశారు. 

కాంట్రాక్టు పనులు, బిల్లులు గత ప్రభుత్వంలోనివే...
మౌలిక వసతుల రంగంలోని కొన్ని కంపెనీలు బోగస్‌ కాంట్రాక్టు బిల్లులతో భారీ ఎత్తున నగదు సమకూర్చుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దీనినిబట్టి చూస్తే కాంట్రాక్టు పనులు, బోగస్‌ బిల్లులన్నీ 2019కి పూర్వం ఉన్న ప్రభుత్వాల్లో జరిగినవేనని తేలికగా అర్థమవుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఎంట్రీ ఆపరేటర్లు (కాంట్రాక్టర్లు), లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా నగదుగా మార్చుకున్న సంగతి బయటపడింది. బోగస్‌ బిల్లులతో ముడిపడిన భారీ ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో ఉన్నట్లు వెల్లడించిన సీబీడీటీ... ఆంధ్రప్రదేశ్‌ పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. బోగస్‌ బిల్లులతో సంబంధం ఉన్నవారు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖుడికి రూ. 150 కోట్ల నగదు సమకూర్చిన సాక్ష్యాలు ఇప్పుడు ఆదాయపన్నుశాఖ వద్ద ఉన్నాయి. బోగస్‌ బిల్లులు, హవాలా చెల్లింపులన్నీ ఈ ఏడాది ఏప్రిల్‌కు ముందు జరిగినవేనని తేటతెల్లమమవుతోంది. ప్రముఖ పత్రికాధిపతి వియ్యంకుడి కంపెనీకి రూ. 5 వేల కోట్ల విలువైన భారీ కాంట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా గత ప్రభుత్వం రూ. 750 కోట్ల మేర మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చిన వ్యవహారంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఐటీశాఖ గుర్తించింది. ఈ కంపెనీ కార్యాలయాలపై 2018లోనే ఆదాయపన్నుశాఖ రోజుల తరబడి దాడులు నిర్వహించింది. అనేక అక్రమ లావాదేవీలతోపాటు వందల సంఖ్యలో షెల్‌ కంపెనీలను ఆ కంపెనీ సృష్టించినట్లు వెల్లడించింది.

పోలవరం ఏటీఎం అన్న ప్రధాని వ్యాఖ్యల వెనుక మర్మమిదే...
పోలవరం కాంట్రాక్టు సంస్థపై పలు పర్యాయాలు దాడులు నిర్వహించిన ఆదాయపన్నుశాఖ... అనేక అక్రమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి 2018 డిసెంబర్‌లో నివేదిక సమర్పించింది. నిర్దేశిత అంచనా కంటే ఎక్కువ మొత్తానికి పనులు అప్పగించడం, భారీగా మొబిలైజేషన్‌ అడ్వాన్సుల నిధులు ఇవ్వడం మొదలుకొని అనేక అక్రమ లావాదేవీలు దాడుల్లో వెలుగులోకి వచ్చాయని అత్యున్నతస్థాయి అధికారి ఒకరు ఇచ్చిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. సదరు కంపెనీ నుంచి ప్రభుత్వంలో ముఖ్యులకు హవాలా ద్వారా భారీగా నగదు చేరిందన్న విషయాన్ని ఐటీశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి సభలో పోలవరం ప్రాజెక్టును కొందరు ఏటీఎంలా వాడుకుంటున్నారన్న సంగతిని బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది. 

>
మరిన్ని వార్తలు