ఇది అబద్ధాల ప్రభుత్వం

15 Mar, 2015 02:15 IST|Sakshi

కడప కార్పొరేషన్: తెలుగుదేశం ఒట్టి మాటలు, అబద్ధాల ప్రభుత్వమని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా విమర్శించారు. ఇలాంటి దగుల్బాజీ, దగాకోరు ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని వారు మండిపడ్డారు. కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు.

బడ్జెట్‌లో రాయలసీమకు, ముఖ్యంగా కడప జిల్లాకు తీవ్ర అన్యాయం చేశార న్నారు. రాయలసీమ వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వర్షాలు పడక, పంటలు పండక రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. వారి ఇక్కట్లను తీర్చేందుకు బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చే శారు.

2012 నుంచి 2014 వరకు ఇన్‌పుట్ సబ్సిడీకి బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయన్నారు. గండికోటకు జూలై కల్లా నీరిస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి, మంత్రులు బడ్జెట్‌లో ఒట్టి చేతులు చూపారని ఎద్దేవా చేశారు. రూ. 1500 కోట్లు అవరమైన ప్రాజెక్టుకు కేవలం రూ. 169 కోట్లు కేటాయించి 35 టీఎంసీలు ఎలా నింపుతారని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 1800 కోట్లు అవసరం కాగా, రూ. 200 కోట్లు మత్రమే కేటాయించారన్నారు. కాలువలు పూర్తి కాకపోవడం వల్ల జీడిపాలెం దాటి కిందికి నీరు వచ్చే పరిస్థితి లేదని, కానీ ప్రభుత్వం పులివెందులకు నీరిచ్చిన తర్వాతే కుప్పానికి తీసుకెళ్తామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  

తెలుగుగంగకు సంబంధించి వెలుగోడు వద్ద 6 కి.మీ కాలువ విస్తరిస్తేనే వరద నీటిని పూర్తిగా నింపుకొనే అవకాశముంటుంద ని, ఆ కాలువలను పూర్తి చేయడానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. రుణమాఫీకి గత బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించి, ఇప్పుడు రూ. 4200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
 
మైనార్టీలపై అక్కసు ప్రదర్శించారు: రాచమల్లు
ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే ముస్లిం, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం అక్కసు ప్రదర్శించిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. మైనార్టీలకు కేవలం రూ. 379 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం దారుణమన్నారు. బీసీలు, చేనేతల వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇందులో ఒరగబెట్టిందేమీ లేదన్నారు. డ్వాక్రారుణాలకు రూ. 14 వేల కోట్లు అవరమైతే, రూ. 1000 కోట్లు మాత్రమే కేటాయించినందున, ఈ ఏడాది కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావని తెలిపారు.  
 
వాస్తవాలు వినే స్థితిలో లేరు: అంజద్‌బాషా
 ప్రభుత్వం భ్రమల్లో బతుకుతోందని, వాస్తవాలను వినే స్థితిలో ముఖ్యమంత్రి, మంత్రులు లేరని ఎస్‌బీ అంజద్‌బాషా విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిద్దామని ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం చర్చకు సంసిద్ధంగా లేదని విచారం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చేనేతలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు