పకడ్బందీ హత్యలా ఉందే!

18 Apr, 2015 01:09 IST|Sakshi
పకడ్బందీ హత్యలా ఉందే!

జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిఠాకూర్
తిరుపతి రూరల్ : ‘కనుచూపు మేరలో ఎవరున్నా  చక్కగా కనిపిస్తున్నారు. వందలాది మంది కూలీలు ఎదురుపడితే కాల్పులు జరిపామంటున్నారు. ఇదంతా మైదాన ప్రాంతం. ఇక్కడ కాల్పులు జరిపితే అందులో కేవలం తొమ్మిది మందే చనిపోయారా? మిగిలిన వారిలో  ఒక్కరూ ప్రాణాలతో దొరకలేదా? ఇదంతా ప్రీప్లాన్డ్ మర్డర్‌లా అనిపిస్తుందే’ అని శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిఠాకూర్ అనుమానాలు వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను  ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం, మృతుల్లో 13 మంది ఎస్టీలే ఉండడంతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీఐజీ, ప్రజాసంఘాలు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి.

ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను శుక్రవారం సాయంత్రం రవిఠాకూర్ స్వయంగా పరిశీలించారు. చీకటీగల కోనలో 9, చచ్చినోడిబండ వద్ద 11 మృతదేహాలు పడివున్న తీరు, ఎన్‌కౌంటర్ జరిగిన విధానంపై  తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
 
ఆ దుంగలెలా వచ్చాయి?
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారివద్ద పెయింటింగ్ మరకలున్న దుంగలు ఉండడం వాస్తవమేనా? అవి వారి వద్దకెలా వచ్చాయి? అంటూ చైర్మన్ రవిఠాకూర్ అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులులను ప్రశ్నించారు. వాటికి అర్బన్ ఎస్పీ సమాధానమిచ్చారు.
 
అధికారులపై మండిపాటు
ముందుగా సమాచారమిచ్చినా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 20 అధికారులుగానీ, టాస్క్‌ఫోర్స్ డీఐజీగానీ రాకపోవడంపై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారంతో శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ, అధికారులు, అటవీముఖ్య అధికారులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బంది హాజరుపరచాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు