చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు

7 Feb, 2020 19:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావు నివాసాల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లో ఆయన నివాసాల్లో దాదాపు 36 గంటలపాటు సోదాలు జరుగుతున్నాయి. ఇక మాజీ మంత్రి నారా లోకేష్‌ ప్రధాన అనుచరుడు కిలారి రాజేష్‌ ఇళ్లల్లో, కంపెనీ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
(చదవండి : చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు)

విజయవాడలోని శ్రీనివాస్‌రావు ఫ్లాట్‌లో పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో సోదాలు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని చంపాపేట్ గ్రీన్‌పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్లాట్‌కు ఆయన్ను తరలించారు. సీఆర్‌పీఎఫ్‌ పహారాలో ఆ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు శ్రీనివాస్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు