కల్కి ఆశ్రమాల్లో ఐటీ దాడులు

17 Oct, 2019 05:06 IST|Sakshi

ఏపీ, తమిళనాడు సహా 40 చోట్ల విస్తృతంగా సోదాలు

రూ.20 కోట్ల నగదు, కీలక పత్రాలు స్వాధీనం

అందుబాటులో లేని కల్కి భగవాన్, అమ్మ భగవాన్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కల్కి ఆశ్రమాలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 40 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సమీపంలో నేమం గ్రామంలో ఉన్న కల్కి ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గోవర్దనపురంలో నివసిస్తున్న కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణాజీ, కోడలు పిత్రాజీ, సహాయ కార్యదర్శి లోకేష్‌ దాసాజీలను వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.

చెన్నై గ్రీమ్స్‌రోడ్డులోని కల్కి ఆశ్రమంలోనూ తనిఖీలు జరిగాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ప్రధాన ఆశ్రమం, కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద ఉన్న సత్యలోకం ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగాయి. కల్కి ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి నేటి వరకు భూముల కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడులు, ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల పేరిట సాగించిన వసూళ్లు, గ్రామాల అభివృద్ధి పేరుతో చేసిన వసూళ్లు వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఐటీ దాడుల సమయంలో కల్కి భగవాన్, అమ్మ భగవాన్‌ అందుబాటులో లేరు. రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారం మేరకే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

భక్తుల నుంచి భారీగా వసూళ్లు
ఎల్‌ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించిన విజయ్‌కుమార్‌ నాయుడు కల్కి భగవాన్‌గా పేరును మార్చుకుని ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో అతిపెద్ద ఆశ్రమం స్థాపించారు. విజయ్‌కుమార్‌ నాయుడు సతీమణి బుజ్జమ్మ అమ్మ భగవాన్‌గా పేరు మార్చుకున్నారు. వీరిద్దరినీ దర్శనం చేసుకునేందుకు  వచ్చే భక్తుల నుంచి భారీస్థాయిలో ప్రవేశ రుసుము వసూలు చేసేవారు.

మరిన్ని వార్తలు