పేరం గ్రూప్‌పై ఐటీ దాడులు

31 Oct, 2018 07:49 IST|Sakshi
ఐటీ దాడుల నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన ఎంవీపీ కాలనీలోని పేరం గ్రూప్‌ కార్యాలయం

ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో సాయంత్రం వరకు సోదాలు

వివరాలు వెల్లడించని అధికారులు రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో గుబులు

విశాఖపట్నం , ఎంవీపీకాలనీ: ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘పేరం గ్రూప్‌’ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. విశాఖతో పాటు బెంగుళూరు, తిరుపతిలో ఏకకాలంలో దాడులు జరిపినట్లు సమాచారం. ఐటీ శాఖకు చెందిన 9 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఉన్న పేరం గ్రూప్‌ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఐటీ అధికారులు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు అధికారులు చేరుకోగా మంగళవారం కార్యాలయానికి సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో కార్యాలయానికి చేరుకున్న అధికారుల బృందం చాలా సేపు గ్రౌండ్‌ ప్లోర్‌లోని కారిడార్‌లో వేచి ఉన్నారు. కొద్దిసేపటి అనంతరం కార్యాలయం తాళాలు బద్దలకొట్టుకొని లోపలికి వెళ్లిన అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ దాడులకు సంబంధించి అధికారుల వివరాలు వెల్లడించలేదు. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంస్థల కార్యాలయాలు కేంద్రంగా దాడులు నిర్వహించిన ఐటీ శాఖ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై దృష్టి సారించడంతో ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది. రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సంస్థలపై దాడుల కొనసాగుతాయేమోననే అనుమానం సర్వత్రా నెలకొంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే పేరం గ్రూప్‌ అధినేత హరిబాబు కొందరు టీడీపీ నాయకులకు బినామీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు హరిబాబు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు బంధవు కావడంతోపాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన టీడీపీకి ఆర్థిక పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. గతంలో సైతం పేరం గ్రూప్‌పై ఐటీ దాడులు జరిగినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఐటీ శాఖ పూర్తిస్థాయి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు