ఐటీ ఉచ్చులో బీద

5 Oct, 2018 09:19 IST|Sakshi
నెల్లూరు మినీబైపాస్‌లోని బీఎమ్మార్‌ గ్రూప్‌ ప్రధాన కార్యాలయం (ఇన్‌సెట్లో) బీద మస్తాన్‌రావు

అనతికాలంలో రూ.వేల కోట్ల

వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి

నెల్లూరు, కావలి: నవ్వాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కమిటీ సభ్యుడు, కావలి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వ్యాపార సామ్రాజ్యం ఆదాయపన్ను శాఖ  ఉచ్చులో చిక్కుకుంది. ప్రధానంగా రొయ్య పిల్లల అమ్మకాలు, రొయ్యల ఎగుమతులు, రొయ్యల మేత అమ్మకాలు ద్వారా చట్టాలను ఉల్లంఘించినట్లుగా గుర్తించి చెన్నై కేంద్రంగా విధులు నిర్వర్తించే ‘కేంద్ర ఐటీ పరిశోధన’ అధికారుల బృందం గురువారం దాడులు నిర్వహించింది. ఐటీ అధికారులు టర్నోవర్, తగిన రసీదులు, బ్యాంక్‌ ఖాతాలు వివరాలతో పాటు  వ్యాపారాల్లో విదేశీ మారకద్రవ్యంకు సంబంధించిన లావాదేవీలపై దృష్టి పెట్టి రికార్డులను, కంప్యూటర్‌లోని హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కావలి వద్ద రొయ్య పిల్లల అమ్మకాలు నుంచి అమెరికాలో ఏర్పాటు చేసిన రొయ్యల అమ్మకాల కేంద్రం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ముందస్తుగా అందిన సమాచారంతో దామవరంలోని బీఎంఆర్‌ ఫ్యాక్టరీల్లో ఉన్న విలువైన సమాచార డాక్యుమెంట్లను అదే సంస్థలో సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బోగోలుకు చెందినగొర్రె రామకృష్ణ ఇంటికి తరలించేసినట్లు తెలిసింది.

ఇది బీద మస్తాన్‌రావు ప్రస్థానం
1991 నుంచి 1996 వరకు సవేరా గ్రూపునకు చెందిన  ‘కేర్‌వెల్‌’ కంపెనీలో స్వల్ప జీతానికి పనిచేశారు.
మాగుంట గ్రూప్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో నలుగురు మిత్రులతో కలిసి అప్పు తీసుకొని అల్లూరు మండలం ఇస్కపల్లిలో ‘బీఎంఆర్‌’ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం (హేచరి)ను  ప్రారంభించారు.
చెన్నైలోని మెరీనా బీచ్‌లో ‘క్లాస్‌విన్‌’ అనే పేరుతో హేచరీని 1997లో  స్థాపించారు.
హేచరీ నిర్వహణ బాధ్యత చూస్తున్న బీద మస్తాన్‌రావు నష్టాలు వచ్చాయని చెప్పి భాగస్తులను వదిలించుకున్నారు.
హేచరీస్‌లో నష్టాలు రావడంతో బ్యాంక్‌కు వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో, ఆ నాటి ఒక టీడీపీ మంత్రి అండదండలతో ‘పనికి ఆహార పథకం’ ద్వారా  ఆర్థిక స్థిరత్వం ఏర్పరచుకుని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సెస్‌ బ్యాంక్‌లను ప్రభావితం చేసి అప్పులు సంపాదించారు.
2001 నుంచి 2008 వరకు పాండిచ్చేరి నుంచి వైజాగ్‌ వరకు పలు హేచరీలను లీజుకు తీసుకున్నారు.
టైగర్, స్కాంపీ రకం రొయ్యల పిల్లల హేచరీల ద్వారా కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించి ఆర్థికంగా బలపడ్డారు.
వైజాగ్‌లో రెండు, చెన్నైలో రెండు, పాండిచ్చేరిలో రెండు, విడవలూరు మండలం రామతీర్థంలో ఒకటి, అల్లూరు మండలం ఇస్కపల్లిలో హేచరీలను స్థాపించారు.
1998లో బినామీ సొసైటీలను సృష్టించి ఇస్కపల్లిలోని మత్స్యకారుల భూములను, మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన డి–ఫారం పొలాలను, రైతుల వద్ద కొనుగోలు చేసిన భూములు మొత్తం సుమారు 700  ఎకరాల్లో రొయ్యలు సాగు చేయడం ప్రారంభించారు.
దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయ భూముల వద్ద ఉన్న పేదల భూములను అధికారుల ద్వారా 2013లో వశపరుచుకుని 2014లో రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్, రొయ్యల మేత తయారీ ఫ్యాక్టరీ నిర్మించారు.
బెంగళూరులోని సూర్య సిటీ వద్ద 25 ఎకరాల్లో జరుగుతున్న రియల్‌ ఎస్టేట్, నిర్మాణాలు, హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద హరిప్రియ ఎస్టేట్స్‌ 23 ఎకరాల్లో నిర్మాణాలు, హైదరాబాద్‌లోని టాటా హెలికాప్టర్‌ తయారీ కేంద్రమైన ఆదిభట్ల వద్ద  35 ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణాలు, కావలి మండలంలో తీర ప్రాంత గ్రామం నందెమ్మపురంలోని మత్స్యకారుల భూములను ప్రభుత్వం ద్వారా స్వాధీన పరుచుకుని నిర్మాణంలో ఉన్న హేచరీ, పాండిచ్చేరిలో నూతనంగా నిర్మిస్తున్న హేచరీ, దేశ వ్యాప్తంగా ఉన్న బిగ్‌–సీ మొబైల్‌ గొలుసు సంస్థలో వాటాలు, తమిళ సినిమా రంగంలో పెట్టుబడులు, ఇటీవలే విడుదలైన తమిళ సినిమా వ్యాపార లావాదేవీలు,  జేఆర్‌ఆర్‌ (జయమ్మ–రఘురామయ్య) ఇన్‌ఫాస్ట్రక్చర్‌ తదితర సంస్థలను బినామీ పేర్లుతో నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు