ఐటీడీఏ పీవో బదిలీ

25 Jan, 2015 02:54 IST|Sakshi
ఐటీడీఏ పీవో బదిలీ

శ్రీశైలంప్రాజెక్టు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నక్కల ప్రభాకరరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు ఇతన్ని బదిలీ చేశారు. ఐటీడీఏ పీవో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను వెలికి తీసి తండాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. చెంచు విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో ప్రవేశాన్ని కల్పించానన్నారు.

ప్రత్యేక అనుమతితో 30 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించి విద్యా శాతాన్ని పెంచినట్లు చెప్పారు. ఆరోగ్యదీపిక కార్యక్రమంతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశానన్నారు. ప్రతీ గూడెంలో ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం రూ. 10లక్షలతో వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని, 1386 మంది యువతకు ఈజీఎంఎం ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు జరిపించామన్నారు.

అటవీశాఖలో 37 మందికి టైగర్ ట్రాకర్లుగా, శ్రీశైలదేవస్థానంలో 16 మందికి సెక్యూరిటీగార్డులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి కింద నామమాత్రపు అద్దెతో 16 మందికి చెంచు బజార్ షాపులను కేటాయించానని వివరించారు.

ట్రైకార్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రతిగూడెంలో విద్యుత్ సౌకర్యం అందించడం కోసం సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం వంటి పనులు చేశానన్నారు. సర్పంచ్‌లుగా 20 మందిని, వార్డుమెంబర్లుగా 73 మందిని ఎన్నికయ్యేటట్లు చేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన  చెప్పారు.
 
ఐటీడీఏలో దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించానన్నారు. ఇదేమార్పును రానున్న అధికారులు తీసుకు రావాలన్నారు. తాను బదిలీపై 27వ తేదీన రిలీవ్ కానున్నట్లు చెప్పారు. అనంతరం చరిత్రలో ఒకరోజు ఒక చెంచుగూడెం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు