గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా..

15 Feb, 2015 00:56 IST|Sakshi
గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా..

ఎటు చూసినా ఎత్తై కొండలు.. చుట్టూ దట్టమైన అడవి.. మధ్యన ఓ కుగ్రామం. దానిపేరు నాగన్నగూడెం. బుట్టాయగూడెం మండలంలోని ఈ గ్రామంలో కొండరెడ్ల తెగకు చెందిన 26 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఈ గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యం లేవు. కేఆర్ పురం ఐటీడీఏ ద్వారా ఈ రెండూ సమకూరారుు. అయినా గ్రామంలో సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అక్కడ ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి.. గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటనే విషయూలను స్వయంగా తెలుసుకునేందుకు కోటరా మచంద్రపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్‌వీ సూర్యనారాయణ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మారు మూలన ఉన్న ఆ గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరిగారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ వివరాలివీ.
 
 పీవో : ఏమయ్యూ.. ఏం పనులు చేస్తున్నారు.
 మాండ్రు శ్రీరామమూర్తి : కూలి పనులు చేసుకుంటున్నామండి.
 కూరగాయల పంటలు వేశాం. ఆ పనులకు వెళ్లి వచ్చాం.
 పీవో : మీ గ్రామంలో ఎన్ని కుటుంబాల వారు నివసిస్తున్నారు.
 మాండ్రు శ్రీరామమూర్తి :  25 కుటుంబాలు ఉంటున్నాయండి.
 పీవో : మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా.
 కట్ల బాబుల్‌రెడ్డి : ఉన్నాయండి. మేం ఇప్పటికీ తాటాకింట్లోనే ఉంటున్నాం. మాకు పట్టాలు ఇప్పించండి. ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలండి.
 పీవో : మీ ఇళ్లకు ఇప్పటివరకు పట్టాలివ్వలేదా
 మనుగుల రామిరెడ్డి : 1999లో అడవిని నరికి.. భూమిని చదును చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నాం. అప్పటి నుంచి ఇదే తాటాకింట్లో ఉన్నాం. పట్టా కోసం తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాం. కానీ ఇవ్వలేదు.
 పీవో : మీ పిల్లలను చదివిస్తున్నారా.
 కట్ల సీత : మా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ పాఠశాలలు లేవండి. 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరి కోసం ఒక అంగన్‌వాడీ కేంద్రం పెట్టించండి.
 పీవో : మీ అందరికీ వ్యవసాయ భూములున్నాయా
 మాండ్రు వెంకటరెడ్డి : ఉన్నాయండి. అయితే భూములకు పట్టాలు లేవు. అటవీ హక్కుల చట్టం కింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నాం. కొంతమందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారికి కూడా పట్టాలిప్పించండి.
 పీవో : అలాగే. దరఖాస్తులను పరిశీలించి పట్టాలిప్పించేందుకు కృషిచేస్తాం.
 కెచ్చెల చిన్నారెడ్డి : అయ్యూ.. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో బెండ తోట, మొక్కజొన్న పంట వేసుకున్నాం. సాగునీరు లేదు. పక్కనే ఉన్న కొవ్వాడ కాలువలోంచి రోజుకు రెండొందల అద్దె కట్టి అయిల్ ఇంజిన్‌తో నీటిని తోడుకుంటున్నాం. ఐటీడీఏ ద్వారా ఆయిల్ ఇంజిన్ ఇప్పించండి.
 పీవో : ట్రైకార్ పథకంలో అవసరమైన రైతులందరికీ ఆయిల్ ఇంజిన్లు ఇప్పించేందుకు కృషిచేస్తా.
 కోండ్ల శ్రీరామమూర్తి : నేను జీడిమామిడి తోట వేశాను. పూత సమయంలో స్ప్రేయింగ్ చేసేందుకు మెషిన్ లేదు. దాన్ని ఇప్పించండి.
 పీవో : అలాగే. దరఖాస్తు పెట్టుకో.
 పట్ల ముత్యాలమ్మ : సార్. మా ఊళ్లో కమ్యూనిటీ హాలు కట్టించండి. పండగలు, పబ్బాల సమయంలో అందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటాం.
 పీవో : ప్రతిపాదనలు తయారు చేయించి నిర్మాణానికి కృషిచేస్తాం.
 నక్కా దేవమణి : సార్. మేం డ్వాక్రా సంఘాల్లో ఉన్నాం. బ్యాంకు ద్వారా ఇచ్చిన సొమ్ము ఎటూ సరిపోలేదు. మాకు మళ్లీ రుణాలు ఇప్పించాలి.
 పీవో : వివరాలివ్వండి. బ్యాంకులు, ఐకేపీ వారితో సంప్రదించి రుణ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా.
 మాండ్రు పోశమ్మ : అయ్యూ. మా ఊళ్లో రోడ్లు వేయించండి.
 పీవో : ముందు ఇళ్లు కట్టించే ఏర్పాటు చేసి.. ఆ తరువాత రోడ్డు నిర్మాణం చేపడదాం.
 పీవో : మీరు టీవీ చూస్తారా? అన్ని విషయాలు తెలుసుకుంటున్నారా?
 ఎం.రామిరెడ్డి : మా ఊళ్లో ఒక్క టీవీ కూడా లేదండి. టీవీ చూడాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని రెడ్డిగూడెం వెళ్తాం. ఈ మధ్యనే కరెంటొచ్చింది. టీవీలు పెట్టుకుంటాం.
 పీవో : సరే.. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి బుధవారం ఐటీడీఏలో
 జరిగే గిరిజన దర్బార్‌కు రండి. ఏ సమస్య ఉన్నా చెప్పండి. పరిష్కారానికి కృషిచేస్తాం.
 
 గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాం
 బుట్టాయగూడెం మండలం నాగన్నగూడెంలో నెలకొన్న సమస్యలపై నాకు పూర్తి అవగాహన వచ్చింది. ప్రాజెక్టు అధికారిగా నా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాను. సాగు భూములున్న వారికి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు వచ్చేలా చూస్తాం. ఇళ్ల స్థలాలకు సంబంధించి రెవెన్యూ అధికారులతో మాట్లాడతాం. గృహ నిర్మాణ అధికారులతో మాట్లాడి ఇళ్లు నిర్మించే ఏర్పాటు చేస్తాం. గ్రామంలో 10మంది పిల్లలు మాత్రమే ఉండటం వల్ల అంగన్‌వాడీ సెంటర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. మినీ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చూస్తా. ఈ గ్రామానికి విద్యు త్ సౌకర్యం లేని సమయంలో ఐటీడీఏ ద్వారా సోలార్ లైట్లు పెట్టాం. ఇప్పుడు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు వచ్చారుు. ప్రస్తుతం గుర్తించిన సమస్యలు పరిష్కరిస్తే గిరిజనులు సంతోషంగా జీవిస్తారు. కొవ్వాడ రిజర్వాయర్ పక్కనే ఉన్నందున గిరిజనులకు ట్రైకార్ పథకంలో ఆయిల్ ఇంజిన్లు మంజూరు చేస్తాం. సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం.
 - ఆర్‌వీ సూర్యనారాయణ, పీవో, ఐటీడీఏ

 

మరిన్ని వార్తలు