ఆనందించదగ్గ సమయమిది: జగన్ కుటుంబ సభ్యులు

23 Sep, 2013 20:28 IST|Sakshi

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జగన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. జగన్‌కు బెయిల్ రావడంతో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయమిదని తల్లి విజయమ్మ  వివిధ ఛానళ్లకు ఇచ్చిన ఇంటూర్యూలో పేర్కొన్నారు. జగన్మోహనరెడ్డికి ప్రజలు అండదండలు ఉన్నాయని, ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆమె  విజ్ఞప్తి చేశారు. ‘ఇది ఒక సంతోషకరమైన సమయమని, మా కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నామని'జగన్ సతీమణి భారతి తెలిపారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.  క్విడ్‌ప్రోకో కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేయడం పూర్తి చేసింది. తమ దర్యాప్తు ముగిసిందని  కూడా సీబీఐ  వెల్లడించింది.  సుప్రీం కోర్టు సూచనల మేరకు గడువు ముగియడంతో బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.  బెయిల్పై  ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు బెయిలు మంజూరు చేసింది.  

 

జగన్మోహన రెడ్డి క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. వైఎస్‌ జగన్‌ సహా 73 మందిపై దర్యాప్తు పూర్తిచేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది.   పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది.

 హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ వివరించింది. మొత్తం పది కంపెనీలకు సంబంధించి దర్యాప్తు చేశామని, ఇందులో ఎనిమిది కంపెనీల్లో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ వివరించింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పివిపి బిజినెస్ వెంచర్స్‌, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌, మంత్రి డెవలపర్స్‌లలో క్విడ్‌ప్రోకోకు  ఆధారాలు లభించలేదని సిబిఐ వెల్లడించింది. 16 కోల్‌కతా కంపెనీలకు సంబంధించి ఇడి, ఐడి  దర్యాప్తు చేస్తున్నాయని  తెలిపింది. తాజా దర్యాప్తుతో మాజీ మంత్రి శంకర్రావు, టిడిపి నేత ఎర్రన్నాయుడుల పిటిషన్లపై దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ తెలిపింది.
 

మరిన్ని వార్తలు