నామినేషన్లకు వేళాయే..

18 Mar, 2019 07:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టానికి సోమవారం తెరలేవనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగానే నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఈ నెల 26 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు నియమితులయ్యారు.

మచిలీపట్నంకు కలెక్టర్‌ ఇంతియాజ్, విజయవాడకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులుగా వ్యవహరిస్తారు. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, విజయవాడ సబ్‌–కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, మిగిలిన 16 నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ రెవెన్యూ కార్యాలయాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. 

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 
సోమవారం నుంచి 25వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ శనివారం, 24వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవుదినాలు కావటంతో ఆ రెండు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తారు. ఎన్నికల కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. 

ఎన్నికల వ్యయంపై నిఘా 
నామినేషన్ల సందర్భంగా ఎన్నికల అధికారులు పోలీసులు రాజకీయపార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే ర్యాలీలు, హంగు ఆర్భాటాలపై నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ వీడియో, ఫొటో క్లిప్పింగ్‌లు తీయించేందుకు సిబ్బందిని నియమించారు. ర్యాలీలకు చేస్తున్న ఖర్చుపై ఎన్నికల ఎక్సెపెండించర్‌ అధికారులు, అంచనాలు త యారు చేస్తుండగా, వాహనాల అనుమతులపై పోలీసు అధికారులు తనిఖీలు చేయనున్నారు. ఎన్నికల కోడ్‌ పక్కాగా అమలు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు