సోదిలా.. సమీక్షలు!

5 Dec, 2018 05:09 IST|Sakshi

బిజీగా ఉన్నట్లు బిల్డప్‌ కోసమే సీఎం చంద్రబాబు తరచూ సమీక్షలు

తనలా పనిచేసే వారు ఎవరూ లేరనే ప్రచారం కోసం ఆరాటం

సీఎం తీరుతో నిజంగా పనిచేసే చాలామంది సమయం వృథా అవుతోంది

కుటుంబానికి, మనవడికి ఆయన సమయం కేటాయిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది

ఆయన 50 శాతం తక్కువ పనిచేస్తే 200 శాతం ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది

‘నవ్యాంధ్రతో నా నడక’లో మాజీ సీఎస్‌ ఐవైఆర్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న సమీక్షలన్నీ నిష్ప్రయోజనంగా మారుతున్నాయని, గంటల తరబడి సమీక్షల వల్ల ఎటువంటి ప్రయోజనం ఒనగూరడం లేదని, ఇవన్నీ కేవలం బిజీగా ఉన్నట్లు బిల్డప్‌ ఇవ్వడానికేనని రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహార శైలి గురించి ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఇవీ...

మిగతావారి పనులకు ఆటంకం...
‘చంద్రబాబు శైలి, వ్యక్తిత్వానికి సంబంధించి రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి... తాను చాలా కష్టపడుతున్నానని, 24 గంటల పాటు పనిచేస్తున్నానని, తనలా పనిచేసేవారు ఎవరూ లేరని ప్రచారం చేసుకోవడం, అలా కనిపించేందుకు ప్రయత్నించడం చంద్రబాబు తరచూ చేస్తుంటారు. ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు దానికి అత్యధిక ప్రచారం ఇస్తుంటాయి. నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు 50 శాతం తక్కువ పనిచేస్తే రాష్ట్రం 200 శాతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కుటుంబం, మనవడితో గడిపేందుకు తీరిక లేదని ఆయన వాపోతుంటారు. అలా వాపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పనిచేయడం వల్ల అదనంగా వచ్చే ఫలితం ఏమీ ఉండదు. ఎటువంటి అదనపు విలువ చేకూర్చకుండా ఆయన అధికంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తే ఏం లాభం? నిజం చెప్పాలంటే  మిగతావారు పనిచేయడానికి ఇది ఆటకంగా మారుతోంది. 

గంటసేపు ఉత్తినే చర్చ...
ఇక రెండోది.. చంద్రబాబు ఆచరణీయమైన రీతిలో గడువులు నిర్దేశించుకోకపోవడం, చేయాల్సిన సమయం కంటే ముందుగా చేయాలంటూ అనవసరంగా హడావుడి చేస్తుంటారు. ఉదాహరణకు యూరోపియన్‌ సంస్థలు షెల్, ఎంజీ కాకినాడలో ఎఫ్‌ ఎస్‌ ఆర్‌ యు (ఫ్లోటింగ్‌ స్టోరేజి, రిగ్యాసిఫికేషన్‌ యూనిట్‌)లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. సముద్రంలోనే లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ను నిల్వచేసే తర్వాత సరఫరా చేస్తారు. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఎన్ని రోజుల్లో మీరీ ప్రాజెక్టు పూర్తి చేస్తారు? అని అప్పుడు చంద్రబాబు అడిగారు. నేను మనసులో వీళ్లు రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేటట్లైతే నాలుగేళ్లు అని చెబితే బాగుండు అనుకున్నా. వెంటనే చంద్రబాబు రెండేళ్లలో చేయలేరా? అని అంటారని అనుకున్నా. కానీ ఆ కంపెనీ వాళ్లు రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని సరైన సమయమే చెప్పారు. దీంతో ఏడాదిలో ఎందుకు పూర్తి చేయకూడదు? అని చంద్రబాబు అడిగారు. అంత తక్కువ సమయంలో వీలు కాదని వాళ్లు బదులిచ్చారు. దీనిపైనే గంటసేపు ఉత్తి చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టు ఇప్పటివరకూ ప్రారంభమే కాలేదు. తమకు లాభసాటి కాదని షెల్, ఎంజీ కంపెనీలు ఉపసంహరించుకున్నాయి. 

వారానికి ఆరు గంటలు వృధా..
రాజధాని తాత్కాలిక సెక్రటేరియట్‌ నిర్మాణం విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకు ఆరు నెలలు పడుతుందని కాంట్రాక్టు తీసుకున్న సంస్థ చెప్పింది. రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తాను ప్రతివారం వచ్చి తనిఖీ చేస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రతి వారం వెళ్లడం వల్ల అక్కడ జరిగే పనిలో వచ్చే మార్పు ఏమీ ఉండదు. పైగా ఆయన చెప్పిన సమయానికి నాలుగు గంటలో ఐదు గంటలో ఆలస్యంగా వెళతారు. దీంతో అక్కడి వాళ్లంతా నాలుగైదు గంటలు ఆయన కోసం వేచి చూస్తూనే ఉంటారు. తర్వాత రెండు గంటల పాటు సమీక్ష జరుగుతుంది. అంటే ప్రతి వారం ఆరు గంటలు వృధా అవుతుంది. చివరకు తాత్కాలిక సెక్రటేరియట్‌ కాంట్రాక్టర్‌ తాను తొలుత చెప్పిన సమయానికే పని పూర్తి చేశారు. అలాంటప్పుడు చంద్రబాబు ప్రతివారం రావడం వల్ల వచ్చిన ఉపయోగమేమిటో? ఎవరికీ అర్ధం కాలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై కూడా ఇదేవిధంగా సమీక్ష చేస్తున్నారు. 

పదేపదే అవే అంశాలు....!
సమీక్ష చేయడంలో తప్పేమీ లేదు. కానీ చంద్రబాబు సరైన కాల పరిమితి ఇచ్చి పాత మినిట్స్‌ దగ్గర పెట్టుకుని హేతుబద్ధంగా సమీక్షించరు. తనను బిజీగా ఉంచుకునేందుకు సమీక్ష పేరుతో పనులు ఆలస్యమయ్యేందుకు కారణమవుతారు. చీటికిమాటికి ఒకే రకమైన సమీక్షలు, పదేపదే అవే అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడటం సోదిలా అనిపిస్తుందని కూడా ఆయనకు తట్టదు. ఆయన వల్ల నిజంగా పనిచేసే చాలా మంది సమయం వృధా అవుతోంది. మండల స్థాయిలో ఉదయమే లేవడం. గంటలు గంటలు ఆయన చెప్పింది వినడం అలవాటైపోయింది. చంద్రబాబు తాను ఎంతో కష్టపడి చేస్తున్నాననే బిల్డప్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయనకు అర్ధం కాదు. అధికారం లేనప్పుడు తనకు సాయం చేసిన వారికి ఇప్పుడు మళ్లీ తగిన రీతిలో ప్రతిఫలాలు అందేలా చూడాలని భావించడం కూడా లక్ష్యాలను నీరు కారుస్తోంది. 

పుత్రుడి జోక్యం కొత్త పరిణామం..
చంద్రబాబు తొలివిడత పాలన సమయంలో ఆయన పుత్రుడి జోక్యం లేదు. ఇప్పుడు అది కొత్త పరిణామం. నేనున్నంత కాలం దాని ప్రభావం ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా అధికార యంత్రాంగంపై ఉంది. చంద్రబాబు తనకు అన్నీ తెలుసన్న అభిప్రాయంతో ఉండడం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. 

‘వాట్‌ ఏన్‌ ఐడియా సర్‌ జీ..!’
కృష్ణా జలాలను బకింగ్‌ హాం ద్వారా పైకి పంపించి పంపులు పెట్టి సోమశిలలో నింపుతాననో ఏదో చెబుతున్నారు. ఇది సాంకేతికంగా ఏమేరకు సాధ్యపడుతుందన్న విషయం మాత్రం ఎవరూ మాట్లాడరు. పైగా ఎలా తయారయ్యారంటే ఆయనను మెప్పించేందుకు ‘వాట్‌ ఎన్‌ ఐడియా సర్‌ జీ..’ అన్న స్థాయిలో ప్రశంసిస్తున్నారు. దీంతో తాను చెప్పింది కరెక్టని చంద్రబాబు అనుకుంటున్నారు. ‘‘గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపాం... ఎప్పుడూ ఇలా జరగలేదు. మేమే చేశాం. ఇదో పవిత్ర సంగమం..’’ అని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పారో. ఎన్ని తడవలు ప్రారంభోత్సవాలు, పూజలు చేశారో! కానీ పవిత్ర సంగమం ఎప్పుడో జరిగిపోయింది. తెలుగుగంగ పేరుతో ఎన్టీఆర్‌ మొదలు పెట్టారు. సోమశిల ప్రాజెక్టులో కృష్ణా జలాలు కలిసినప్పుడే పవిత్ర సంగమం ఏర్పడింది. అది వదిలేసి ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నామని ప్రచార్భాటం చేస్తున్నారు. 

అందని పండ్ల కోసం రాళ్లు...
నేను మొదట్లోనే చెప్పా. వెలగపూడి వద్ద రాజధాని ఏర్పాటు చేస్తున్నప్పుడు తొలి ప్రాధాన్యతగా విజయవాడను వెలగపూడితో రైల్వే లైన్‌తో అనుసంధానం చేయాలని. ఇది చాలా చిన్న అంశం. కృష్ణా కెనాల్‌ ద్వారా వెలగపూడికి రైల్వేలైన్‌ తెచ్చి గుంటూరు దగ్గర కలిపేయవచ్చు. రెండు లైన్లూ కలుస్తాయి. అది చిన్న ప్రాజెక్టు. గట్టిగా అడిగితే కేంద్ర ప్రభుత్వం ‘నో’ అనేది కాదు. ఆఫీసుకు వెళ్లే వారికి ఇబ్బందులు ఉండేవి కావు. తొలుత ఫోకస్‌ చేసి అది పూర్తి చేసుకోవచ్చు కదా.. కానీ అలా చేయకుండా విజయవాడ మెట్రో, హైపర్‌ లూప్‌ రైళ్లు, గూడూరు నుంచి విశాఖ వరకు హైస్పీడ్‌ బుల్లెట్‌ రైళ్లు అంటూ ఆచరణీయం కాని వాటి గురించి మాట్లాడుతుంటారు. చెట్టు చిటారున ఉన్న పండ్లపై కంటే కిందికి వేలాడుతున్న పండ్లను ముందు తెంచుకోవాలని ఆయనే (చంద్రబాబు) ఎన్నోసార్లు అన్నారు. కానీ ఆయన దృష్టి ఎప్పుడూ అందని చిటారుకొమ్మపైన పండ్లపైనే ఉంటుంది. వాటి కోసం రాళ్లు విసురుతూ ఉంటారు’ 

మరిన్ని వార్తలు