చంద్రబాబు లేఖపై తీవ్రంగా స్పందించిన ఐవైఆర్‌

28 Jun, 2018 11:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆభరణాల అంశంలో హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత విచారణ అవసరం ఉందా.. లేదా అని నిర్ణయించుకోవాలని సూచించారు. శ్రీవారి ఆభవరణాల విషయంలో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డిలపై పరువు నష్టం వేయడం అర్థరహితమని ఐవైఆర్‌ అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ దుమారం నుంచి తమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇది చేసి ఉంటే వారికి మంచిది కాదని హితవు పలికారు. న్యాయస్థానం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో ఆయన ట్వీట్లు చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు, విజయసాయి గారి మీద పరువునష్టం దావాలు కూడా అర్థరహితం అవుతాయి’,  ‘ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుందని’  ఐవైఆర్‌ కృష్ణారావు వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఐవైఆర్‌ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు