చంద్రబాబు సర్కార్‌ తీరుపై ఐవైఆర్‌ ధ్వజం

23 Jan, 2018 20:23 IST|Sakshi

బ్రాహ్మణ, కాపు కులాలపై చిత్తశుద్ధేదీ?

- మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిపై  ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌, కాపు కార్పొరేషన్లకు ఉన్నతాధికారుల నియామకంపై  ఆయన సునిశిత విమర్శ చేశారు. గతంలో ఆరునెలల పాటు బ్రాహ్మణ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టరే (ఎండీ) లేని పరిస్థితిలో పని చేసిందని.. తర్వాత ఆ పదవిలో నియమించిన ఐఏఎస్‌ అధికారి పద్మను కూడా ఆరు నెలలు పూర్తి కాకముందే అక్కడ నుంచి బదిలీ చేసి, ఆమెకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడాన్ని ఐవైఆర్‌ ట్విటర్‌ ద్వారా తప్పుపట్టారు.

దాదాపు రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కనీసం ఐఏఎస్‌ అధికారిని కూడా నియమించకుండా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని ఆ బాధ్యతల్లో నియమించారని దుయ్యబట్టారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించిన రెండు కులాలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు