దీనికోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేశా: జబర్దస్త్‌ ఫేం

3 Sep, 2019 10:52 IST|Sakshi

సాక్షి, భీమవరం (ప్రకాశంచౌక్‌): నటనపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నానని, జబర్దస్త్‌ షోతో బాగా గుర్తింపు లభించిందని నటుడు అదిరే అభి పేర్కొన్నారు. నటనలో చిరంజీవి అంటే ఎంతో ఇష్టమన్న ఆయన తనకు దర్శకత్వం అంటే కూడా ఎంతో ఇష్టమని, బాహుబలి–2కి రాజమౌళి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పారు. భీమవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రశ్న: మీ పూర్తి పేరు? ఏం చదువుకున్నారు?
అభి: నాపేరు అభినవకృష్ణ, ఎమ్మెసీ చదివాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడిని.

ప్రశ్న: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి ఎందుకు బుల్లితెర వైపు వచ్చారు?
అభి: నేను 2016 వరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయడం జరిగింది. ఉద్యోగం చేస్తుండగానే యాంకరింగ్‌ షోలు చేసేవాడిని. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించారు. నటనపై ఉన్న ఆసక్తితో 2017లో ఉద్యోగం వదలిపెట్టాను. జబర్దస్త్‌లో అవకాశం రావడంతో మంచి పేరు వచ్చింది.

ప్రశ్న: ప్పటివరకు ఏఏ సినిమాల్లో నటించారు?
అభి: నేను మొదటిసారిగా ప్రభాస్‌ ఈశ్వర్‌ సినిమాలో ఆయనకు ఫ్రెండ్‌గా నటించాను. గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ సినిమాలో నటించడం జరిగింది.

ప్రశ్న: జబర్దస్త్‌ షో గురించి చెప్పాలి అంటే?
అభి: జబర్దస్త్‌ షో ప్రతిభ ఉన్న వారికి వారి ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి ప్లాట్‌ఫామ్‌. అప్పారావు, శంకర్, శ్రీను, నరేష్, నాకు జబర్దస్త్‌ షో వల్లే మంచి నటులుగా గుర్తింపు వచ్చింది. సినిమా అవకాశాలు కూడా ఈ షో వల్ల మాకు వస్తున్నాయి.

ప్రశ్న: మీకు ఇష్టమైన నటుడు, దర్శకుడు?
అభి: నాకు చిరంజీవి అంటే ఇష్టం ఆయన నాకు ఆదర్శం. దర్శకులు సంజయ్‌ బన్సాలీ అంటే ఇష్టం.

ప్రశ్న: నటన కాకుండా ఇతర శాఖలో ఆసక్తి ఉందా?
అభి: దర్శకత్వం అంటే ఇష్టం అందుకే బహూబలి–2కి రాజమౌళి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను.

ప్రశ్న: నూతన సినిమాలు ఏం చేస్తున్నారు.?
అభి: దర్శకుడు శ్రీనివాసరెడ్డి తీస్తున్న రాగల 24 గంటలు అనే సినిమాలో నటిస్తున్నాను.

ప్రశ్న: భీమవరం గురించి చెప్పాలి అంటే?
అభి: భీమవరం వాసుల అపాయ్యతలకు, అభిమానానికి హద్దులు ఉండవు. ఎంతో గౌరవంగా అభిమానంగా చూస్తారు. ముఖ్యంగా ఇక్కడ సీఫుడ్‌ భోజనం అంటే నాకు చాలాచాలా ఇష్టం. దటీజ్‌ భీమవరం. 

మరిన్ని వార్తలు