ఎందుకంత గోప్యత!

24 Oct, 2013 03:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంతో పాటు కొందరు నేతలు అనుసరిస్తున్న వైఖరిపై జేఏసీ ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు సైతం కనీస సమాచారం లేకుండా వరుసగా చేస్తున్న పర్యటనలు, జరుపుతున్న భేటీలపై వారు లోలోపల రగిలిపోతున్నారు. నెల కిందట రహస్యంగా ఢిల్లీకి వెళ్లి రావడంపై జేఏసీ సమావేశంలో ముఖ్యులంతా గట్టిగా నిలదీస్తే మరోసారి అలా జరగనివ్వనని వివరణ ఇచ్చిన కోదండరాం.. మళ్లీ అదే తీరును కొనసాగిస్తూ పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌తో భేటీ కావడం వివాదానికి తెరతీసింది.
 
 కోదండరాం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనతో ఉన్నవారే ఇప్పుడు కూడా ఉండటం, రహస్య కార్యక్రమాలు కొనసాగుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే కాకుండా మరేమైనా రహస్య ఎజెండాలున్నాయా..’ అనే అనుమానాలకు ఈ పరిణామాలు తావిస్తున్నాయని జేఏసీ ముఖ్యులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలను జేఏసీ ప్రతినిధులు కలవడం తప్పేమీ కాదని, అయితే ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా కలవాల్సిన అగత్యంపైనే తమ అభ్యంతరమని అంటున్నారు. ‘జేఏసీ అంటే 40కి పైగా సంఘాల సమాహారం. దీనికి స్టీరింగ్ కమిటీతో పాటు మరికొన్ని ముఖ్యమైన కమిటీలు కూడా ఉన్నాయి. అన్ని అంశాలను పారదర్శకంగా చర్చిస్తున్నప్పుడు ఈ రహస్య భేటీల అవసరం ఏముందన్నదే మా ప్రశ్న’ అని జేఏసీ ముఖ్యుడొకరు ప్రశ్నించారు.
 
 రాజకీయ అంశాలేమైనా ఉన్నాయా?
 జేఏసీలో కీలకంగా పనిచేస్తున్న కొందరు ముఖ్యులకు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఇలాంటి వారికోసమే ఢిల్లీ పర్యటన, డీఎస్‌తో భేటీ జరిగిందా? అనే అనుమానాలను పలువురు జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తులుగా రాజకీయ లక్ష్యాలు ఉండటం తప్పు కాదని, అయితే వాటికి జేఏసీగా, సమష్టి ప్రతినిధులుగా వెళ్లడంపైనే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు. జీవోఎంకు జేఏసీ ఇచ్చిన నివేదికను అడిగినందుకే డీఎస్‌ను కలిసినట్టుగా ఇస్తున్న వివరణతోనూ జేఏసీ నేతలు సంతృప్తిగా లేరు.  రాజకీయ లక్ష్యాలుంటే సంఘాలుగా, వ్యక్తులుగా బహిరంగంగా కలిస్తే తప్పుబట్టాల్సిన అవసరం లేదని, రహస్యంగా కలవాల్సిన అగత్యాన్నే తప్పుబడుతున్నామని జేఏసీ ముఖ్య నేతలు అంటున్నారు.

మరిన్ని వార్తలు